భారతదేశంలో ఈ ఏడాది రుతుపవనాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దేశవ్యాప్తంగా కురిసే నైరుతి రుతుపవనాల వర్షపాతం ఈసారి సాధారణం కంటే చాలా తక్కువగా కేవలం 90 శాతం (LPA) మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శుక్రవారం వెల్లడించింది. గత ఏప్రిల్ నెలలో అంచనా వేసిన 92 శాతం కంటే ఇది ఇంకా తక్కువ కావడం గమనార్హం. దీనికి తోడు దేశంలో సాధారణం కంటే ఎక్కువ రోజులు ఎండతీవ్రత (వడగాడ్పులు) కొనసాగుతుందని తాజా అంచనాల్లో స్పష్టం చేసింది.
జూన్ నెలలో బలహీనమైన ‘ఎల్ నినో’ (El Nino) పరిస్థితులు ఏర్పడి, రుతుపవనాల సీజన్ రెండో సగభాగం నాటికి అవి మరింత బలపడే అవకాశం ఉందని IMD తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ నైరుతి రుతుపవనాల సీజన్ వర్షపాతం లాంగ్ పీరియడ్ యావరేజ్ (LPA)లో 90 శాతంగా (+/- 4 శాతం మోడల్ ఎర్రర్‌తో) ఉండే అవకాశం ఉంది. ఇది సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని సూచిస్తోంది.
ఈశాన్య భారత దేశంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని జూన్ నెలలో ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలతో పాటు.. మహారాష్ట్ర, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాడ్పులు వీచే అవకాశం ఉంది అని వెల్లడించింది.
Also Read:మోదీకి నచ్చిన..’పెద్ది’!
గత ఏప్రిల్ నెలలో విడుదల చేసిన మొదటి దశ దీర్ఘకాలిక అంచనాల్లో వాతావరణ శాఖ.. ఈ ఏడాది వర్షపాతం 92 శాతంగా ఉండవచ్చని పేర్కొంది. కానీ తాజా అంచనాల్లో ఆ సంఖ్యను 90 శాతానికి తగ్గించడం వ్యవసాయ రంగంపై ఆధారపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారనుంది. 1971-2020 మధ్య కాలానికి సంబంధించిన దేశ సగటు వర్షపాతం (LPA) 87 సెంటీమీటర్లుగా ఉంది. తక్కువ వర్షపాతం నమోదవుతుందనే ఈ తాజా అంచనా భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

