అస్సాం రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం అస్సాం ప్రభుత్వం అసెంబ్లీలో ‘యూనిఫాం సివిల్ కోడ్ (UCC), అస్సాం 2026’ బిల్లును ప్రవేశపెట్టింది. బహుభార్యాత్వాన్ని నిషేధించడం మరియు లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయడం ఈ బిల్లులోని ప్రధానాంశాలు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరపున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా ఈ బిల్లును సభ ముందు ఉంచారు.
వివాహం, విడాకులు, ఆస్తి వారసత్వం మరియు లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లకు సంబంధించిన చట్టాలను సరళీకరించడం మరియు ఏకీకృతం చేయడం ఈ బిల్లు ఉద్దేశ్యం. పురుషులకు కనీస వయస్సు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లుగా నిర్ణయించారు. దేశంలోనే మొదటిసారిగా లైవ్-ఇన్ బంధాలకు ఒక చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఈ బిల్లు కల్పిస్తోంది. భాగస్వాముల హక్కులను మరియు అటువంటి బంధాల ద్వారా జన్మించే పిల్లల హక్కులను కాపాడటానికి రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేశారు.
అస్సాంలోని షెడ్యూల్డ్ తెగలకు (Scheduled Tribes) ఈ చట్టం వర్తించదు. అలాగే సాంప్రదాయ మతపరమైన ఆచారాలు, కర్మకాండలకు మినహాయింపు ఇచ్చారు. భాగస్వాముల హక్కులను, ముఖ్యంగా అటువంటి బంధాల ద్వారా పుట్టిన పిల్లల హక్కులను అధికారికంగా గుర్తించి రక్షించడమే మా ప్రాధాన్యత అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
UCC ప్రధానంగా వివాహానికి కనీస వయస్సు నిర్ణయం,బహుభార్యాత్వ నిర్మూలన,తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులు,లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ల క్రమబద్ధీకరణ ఉంటుందన్నారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే ఉత్తరాఖండ్ మరియు గుజరాత్ తర్వాత దేశంలో UCC చట్టాన్ని ఆమోదించిన మూడవ రాష్ట్రంగా అస్సాం నిలుస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 (ఆదేశిక సూత్రాలు) ప్రకారం, దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకే విధమైన పౌర స్మృతిని తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేయాలి.
Also Read:కేకేఆర్ ఆటగాళ్లపై రహానే ప్రశంసలు

