అరుదైన వింత ..’జీరో షాడో డే’!

5
- Advertisement -

భాగ్యనగర వాసులు నేడు అరుదైన ఖగోళ దృగ్విషయానికి సాక్ష్యం కాబోతున్నారు. సరిగ్గా మధ్యాహ్నం సమయంలో మన నీడ మనకు కనిపించకుండా మాయమైపోయే ‘జీరో షాడో డే’ (Zero Shadow Day) నేడు సంభవించనుంది.

హైదరాబాద్‌లో ఈ అద్భుతం మధ్యాహ్నం 12:12 గంటలకు సంభవించనుంది. ఈ సమయంలో సూర్యుడు సరిగ్గా మన నెత్తిమీదఉండటం వల్ల, భూమిపై నిటారుగా ఉన్న ఏ వస్తువు నీడ కూడా పక్కకు పడదు. కొద్ది నిమిషాల పాటు నీడలు పూర్తిగా మాయమవుతాయి.

సాధారణంగా సూర్యుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు నీడల పొడవు, దిశ మారుతూ ఉంటాయి. కానీ, ఏడాదికి రెండుసార్లు మాత్రం సూర్యుడు సరిగ్గా మన నడినెత్తి మీదకు వస్తాడు.భూమధ్యరేఖకు, కర్కాటక రేఖ మరియు మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ దృగ్విషయం కనిపిస్తుంది.

సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే క్రమంలో, సూర్యకిరణాలు భూమిపై లంబంగా (90 డిగ్రీల కోణంలో) పడతాయి. దీనివల్ల నీడ వస్తువు కిందకే ఉండిపోవడంతో పక్కకు కనిపించదు. దీనిని గమనించడానికి మీరు మధ్యాహ్నం 12:12 గంటలకు ఎండలో ఒక ఖాళీ బాటిల్‌ను గానీ లేదా పైపును గానీ నిటారుగా ఉంచి చూడండి. ఆ వస్తువు నీడ పక్కకు పడకుండా సరిగ్గా దాని కిందకే ఉండటాన్ని మీరు గమనించవచ్చు.

హైదరాబాద్‌తో పాటు దక్షిణ భారతదేశంలోని వివిధ నగరాల్లో వేర్వేరు రోజుల్లో ఈ జీరో షాడో డే సంభవిస్తుంది. ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్న వారికి, విద్యార్థులకు ఇదొక గొప్ప అనుభవం. ఈ అరుదైన అవకాశాన్ని మిస్ కాకండి!.హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి కాబట్టి, ఈ వింతను చూసే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:దేశ ఆత్మగౌరవానికి నిదర్శనం..సోమనాథ్‌ ఆలయం

- Advertisement -