పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు సువేందు అధికారి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ వేడుకలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. దీంతో స్వాతంత్య్రానంతరం బెంగాల్‌లో తొలి బీజేపీ ప్రభుత్వం అధికారికంగా కొలువుదీరింది.
ఈ చారిత్రాత్మక ఘట్టానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మరియు దాదాపు 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (పొచీషే బోయిషాఖ్) సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ప్రమాణ స్వీకారానికి ముందు ప్రధాని మోదీ ఠాగూర్‌కు నివాళులర్పించారు.
సువేందు అధికారితో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కీర్తన్యా, క్షుదిరామ్ తుడు మరియు నిసిత్ ప్రామాణిక్ ఉన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సువేందు అధికారి స్పందిస్తూ.. ఇది బెంగాల్‌లో “డబుల్ ఇంజిన్” సర్కార్ శకం అని అభివర్ణించారు.
సోనార్ బంగ్లా (బంగారు బెంగాల్) కల నెరవేర్చేందుకు, శాంతి మరియు సుస్థిరతను నెలకొల్పేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ విజయం బెంగాల్ ప్రజలదని, గత 15 ఏళ్ల నాటి పాలనకు ప్రజలు ముగింపు పలికారని ఆయన పేర్కొన్నారు.
ప్రమాణ స్వీకార వేదికపై బీజేపీలో అత్యంత సీనియర్ కార్యకర్త అయిన 98 ఏళ్ల మఖన్‌లాల్ సర్కార్ ఆశీర్వాదాలను ప్రధాని మోదీ తీసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. 1952లో శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి కశ్మీర్ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర మఖన్‌లాల్‌కు ఉంది.
Also Read:రష్యా-ఉక్రెయిన్ వార్..కీలక పరిణామం

