తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) కార్మికులు, ఉద్యోగుల చిరకాల డిమాండ్లపై సందిగ్ధత తొలగిపోయింది. ప్రభుత్వంతో ఆర్టీసీ ఐకాస (Joint Action Committee) జరిపిన చర్చలు సానుకూల వాతావరణంలో ముగిశాయి. కార్మికుల ప్రధాన డిమాండ్లను అంగీకరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
చర్చల అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు.ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కార్మికుల ఆర్థిక స్థితిగతులకు ఎంతో ఊరటనిచ్చే అంశం.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నారు.
ఇటీవల మరణించిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా రూ. 10 లక్షల నగదు సాయం,ఒక ఇందిరమ్మ ఇల్లు,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు.
Also Read:కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు హైకోర్టులో రిలీఫ్
చర్చలు సఫలం కావడంతో కార్మికులు తమ నిరసనలను విరమించారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు యథావిధిగా నడుస్తాయని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆర్టీసీ ఐకాస నేతలు హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రికి మరియు మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

