మన మెదడు ఆరోగ్యం అనేది వయసు పెరిగిన తర్వాత ఆలోచించాల్సిన విషయం కాదు, మన దైనందిన అలవాట్లే దాని పనితీరును నిర్ణయిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది మెదడు ఆరోగ్యం అంటే వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు లేదా ఇతర సమస్యల గురించి మాత్రమే అనుకుంటారు. కానీ, మనం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న పనులే మన మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మరియు ఏకాగ్రతను నిశ్శబ్దంగా మార్చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఒకే సమయంలో ఫోన్ చూడటం, మెసేజ్‌లకు సమాధానం ఇవ్వడం, పని చేయడం మనకు ఉత్పాదకతలా అనిపించవచ్చు. కానీ మెదడుకు ఇది శ్రమతో కూడుకున్న పని. తరచుగా ఒక పని నుండి మరో పనికి మారడం వల్ల మెదడు కేవలం తక్కువ సమయం మాత్రమే ఏకాగ్రత వహించేలా అలవాటు పడిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా ఒక విషయంపై ఎక్కువ సేపు దృష్టి పెట్టడం కష్టమవుతుంది.
పని ఒత్తిడిలో మనం మొదట త్యాగం చేసేది నిద్రనే. “ఒక్క రోజే కదా” అని సరిపెట్టుకుంటాం, కానీ అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.తక్కువ నిద్ర వల్ల ఆలోచనల్లో స్పష్టత లోపించడం, విషయాలను త్వరగా గుర్తుకు తెచ్చుకోలేకపోవడం మరియు మానసిక అలసట (Mental Fog) ఏర్పడతాయి.
మనం తినే ఆహారం, చేసే వ్యాయామం నేరుగా మెదడుకు అందే రక్త ప్రసరణతో ముడిపడి ఉంటాయి. పోషకాహారం లోపించినా లేదా శారీరక శ్రమ లేకపోయినా మెదడు సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. వ్యాయామం ఉన్న రోజుల్లో ఆలోచనలు స్పష్టంగా ఉండటానికి కారణం మెదడుకు అందే మెరుగైన పోషణే.
ఖాళీ సమయం దొరికితే చాలు ఫోన్ చూడటం లేదా ఏదో ఒకటి చదవడం మనకు అలవాటు. దీనివల్ల మెదడుకు విశ్రాంతి తీసుకునే అవకాశం లేకుండా పోతోంది.
ఎప్పుడూ ఏదో ఒక సమాచారాన్ని స్వీకరిస్తూ ఉండటం వల్ల మెదడుకు విషయాన్ని విశ్లేషించుకునే (Process) సమయం దొరకదు. దీనివల్ల ప్రశాంతంగా ఉండటం కూడా ఒక అసౌకర్యంగా మారిపోతుంది.
మెదడు ఆరోగ్యం అనేది ఒక్క రోజులో దెబ్బతినదు, అలాగని ఒక్క రోజులో మెరుగుపడదు. మనం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న మార్పులే ఫలితాన్ని ఇస్తాయి. తగినంత నిద్ర, పోషకాహారం, క్రమబద్ధమైన వ్యాయామం మరియు అనవసరపు డిజిటల్ అలజడిని తగ్గించుకోవడం ద్వారా మెదడు పనితీరును మళ్లీ మెరుగుపరుచుకోవచ్చు.
Also Read:పిల్లలకు మాటలు ఆలస్యమవ్వడం ఆటిజమా?

