కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మరియు మహిళా రిజర్వేషన్ల అంశంపై దక్షిణాది రాష్ట్రాల మధ్య ఐక్యత పెరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి…. కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రాసిన లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నెపంతో, లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుండి 850కి పెంచాలని కేంద్రం చూస్తోందని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాస్తూ, ఈ అంశంపై కలిసి పోరాడాలని కోరారు.
లేఖలోని ప్రధానాంశాలు:
1. దక్షిణాది గొంతు నొక్కడమే:
లోక్‌సభ స్థానాల సంఖ్య పెంచితే ఉత్తరాది రాష్ట్రాల (ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, బీహార్) ప్రాబల్యం పెరుగుతుందని, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాముఖ్యత తగ్గుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఉదాహరణకు: కేరళలో ప్రస్తుతం 20 స్థానాలు ఉండగా, కొత్త ప్రతిపాదన ప్రకారం అవి 30 అవుతాయి. కానీ ఉత్తరప్రదేశ్‌లో 80 స్థానాలు కాస్తా 120 అవుతాయి. అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ అంతరం 60 నుండి 90కి పెరుగుతుంది.
2. జనాభా నియంత్రణకు శిక్షా?:
దక్షిణాది రాష్ట్రాలు విద్య, ఆరోగ్యం, ముఖ్యంగా జనాభా నియంత్రణలో అద్భుతమైన ప్రగతి సాధించాయని, ఆ కారణంతో లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గించడం అంటే మంచి పని చేసినందుకు శిక్ష వేయడమేనని రేవంత్ రెడ్డి విమర్శించారు.
3. ఆర్థిక అన్యాయం:
దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి అత్యధిక పన్నులు చెల్లిస్తున్నాయని, కానీ కేంద్రం నుండి తిరిగి పొందుతున్న వాటా మాత్రం చాలా తక్కువని ఆయన గుర్తుచేశారు. ఉదాహరణకు, బీహార్ తాను ఇచ్చే ప్రతి రూపాయికి రూ. 6.69 తిరిగి పొందుతుంటే, కేరళ కేవలం 60 పైసలు మాత్రమే పొందుతోందని ఆయన లేఖలో వివరించారు.
Also Read:తమిళనాడు సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ
4. అయోమయానికి కేంద్రం ప్రయత్నం:
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన మరియు సీట్ల పెంపు.. ఈ మూడింటినీ కలిపి కేంద్రం ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, కానీ దానిని సీట్ల పెంపుతో ముడిపెట్టడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి కేవలం పినరయి విజయన్‌కే కాకుండా, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ మరియు ఇతర దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా లేఖలు రాశారు

