హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కు ఢిల్లీ హైకోర్టు ఝలకిచ్చింది. సీఎం వీరభద్రసింగ్‌ను గతకొంతకాలంగా మనీలాండరింగ్ కేసు వెంటాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ వీరభద్రసింగ్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. సీఎంతో పాటు మరికొందరి అభ్యర్థలను కూడా న్యాయస్థానం కొట్టివేసింది.
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో 2015 సెప్టెంబర్‌లో వీరభద్రసింగ్, ఆయన భార్య, మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. దీనిపై అప్పట్లో సోదాలు కూడా నిర్వహించింది. అయితే ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు.
కాగా.. రాజకీయ కక్షలతోనే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని సీఎం వీరభద్రసింగ్ ఆరోపించారు. ఈ కేసును కొట్టివేయాలంటూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనిపై ఈ ఏడాది మార్చిలో విచారణ చేపట్టిన న్యాయస్థానం వీరభద్రసింగ్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో సీబీఐ ఆయనపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో బెయిల్ కోరుతూ సీఎం వీరభద్రసింగ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. కోర్టు అందుకు అంగీకరించింది. వ్యక్తిగత పూచికత్తుపై వీరభద్రసింగ్, ఆయన బార్య సహా నిందితులందరికీ బెయిల్‌ను మంజూరు చేసింది. తాజాగా కేసును కొట్టివేయాలంటూ మరోసారి పిటిషన్ వేయగా.. న్యాయస్థానం తోసిపుచ్చింది.