హీరోలతో పాటు అదే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకునే డైరెక్టర్ లు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో ఒకరు బోయపాటి శ్రీను. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్స్ లో బోయపాటి మార్క్ మర్చిపోలేనిది.
కథలో కుదిరినన్ని మాస్ ఎలిమెంట్స్ ను యాడ్ చేయడంతోపాటు.. తన సినిమాలో నటించే హీరో లేదా విలన్ కు అంతకుముందు వరకూ వారు కనిపించిన తీరుకు భిన్నమైన మేకోవర్ ఇచ్చి, మరింత పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయడంలో సిద్ధహస్తుడు బోయపాటి. అయితే ఇలాంటి డైరెక్టర్ ప్రస్తుతం హీరో వేటలో పడ్డాడు.
ప్రస్తుతం టాలీవుడ్లో హీరోలెక్కువైపోయారు. ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్లు తక్కువైపోయారు. ఫామ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లందరికీ కూడా మాంచి డిమాండ్ ఉంది. దర్శకులకు హీరోలతో సమానంగా పారితోషకాలిచ్చి సినిమాలు చేయించుకుంటున్నారు నిర్మాతలు. కానీ చివరి సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ తర్వాతి సినిమా ఏదో తేలక సతమతమవుతున్న దర్శకులూ కొంతమంది లేకపోలేదు.
అందులో వి.వి.వినాయక్ ఒకడు. ఈ సంక్రాంతికి ఆయన్నుంచి ‘ఖైదీ నెంబర్ 150’ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. కానీ ఆ సినిమా విడుదలై ఐదారు నెలలువుతున్నా ఇప్పటిదాకా వినాయక్ తర్వాతి సినిమా ఖరారవ్వలేదు. వినాయక్ తో పని చేయడానికి ఖాళీగా ఉన్న స్టార్ హీరో కనిపించట్లేదు.
అలాగే బోయపాటి శ్రీను సైతం తన తర్వాతి సినిమా విషయంలో సందిగ్ధతతో ఉన్నాడు. నిజానికి బోయపాటితో పని చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తితో ఉన్నాడు. బోయపాటికి అల్లు అరవింద్ నుంచి అడ్వాన్స్ కూడా ఇప్పించాడు. కానీ బోయపాటి ఖాళీ అయ్యే సమయానికి చిరు బిజీ అయిపోతున్నాడు. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాను ఈ ఏడాదే పూర్తి చేసి బోయపాటి సినిమాపై దృష్టిసారించాలనుకున్నాడు చిరు. కానీ ఈ సినిమా ఆరంభమే ఆలస్యమవుతోంది. వచ్చే ఏడాది ప్రథమార్ధమంతా కూడా ఈ సినిమాకే డేట్లు కేటాయించనున్నాడు చిరు.
మామూలుగా బోయపాటి ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమా స్క్రిప్టు పని మొదలుపెడతాడు. అందుకు నాలుగైదు నెలలు సమయం తీసుకుంటాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తున్న ‘జయ జానకి నాయక’ ఆగస్టు 11న విడుదలవుతుంది. చిరు సినిమాకు ఈ ఏడాది చివర్లోపు స్క్రిప్టు పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఇంకో ఆరు నెలలైనా చిరుకోసం ఎదురు చూడాలి.
కాబట్టి మధ్యలో ఇంకో సినిమా ఏదైనా చేస్తే ఎలా ఉంటుందని చూస్తున్నాడట. కానీ బోయపాటి అడిగిన సమయంలో డేట్లిచ్చి అతడితో సినిమా చేసే స్టార్ హీరో ఎవరో చూడాలి. అతడి ట్రాక్ రికార్డు చూసి సినిమా చేయడానికి చాలా మందే ఆసక్తి చూపిస్తారు కానీ.. సడెన్ గా డేట్లు ఇవ్వమంటే ఎవరు ముందుకొస్తారో చూడాలి. ఒకవేళ వేరే హీరోతో సినిమా మొదలుపెట్టినా.. చిరు ఖాళీ అయ్యే సమయానికి బోయపాటి ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేస్తాడా అన్నది డౌటు. మరి ఇలాంటి పరిస్థితుల్లో..ఈ మాస్ డైరెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.