ఒకేరోజు నాలుగైదు సినిమాలు చేసేవారు..

204
Celebrities pay rich tribute to Dasari Narayana Rao
Celebrities pay rich tribute to Dasari Narayana Rao
- Advertisement -

టాలీవుడ్ లో తలెత్తే ప్రతి సమస్యకు పరిష్కారం దాసరి… అలాంటి దాసరి ఇక లేరని తెలియడంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎందరో శిష్యులుగల దాసరిని కడచూపు చూసేందుకు సినీ పరిశ్రమ దారులన్నీ దాసరి నివాసానికే చేరుతున్నాయి. ఆయనను కడసారి చూసేందుకు అభిమానులు, సినీ పరిశ్రమ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. దాసరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

దాసరి నారాయణరావు మృతికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంతాపం తెలిపారు. దాసరి నారాయణరావు మరణ వార్త తెలియడంతో స్పాట్ లో ఉన్న పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్ షూటింగ్‌ ను నిలిపేశారు. అంతే కాదు ప్యాకప్ చెబుతూనే… దాసరి మృతికి సంతాపంగా మూడు రోజుల పాటు షూటింగ్‌ నిర్వహించకూడదని నిర్ణయించారు.

దాసరి నారాయణరావు ఆకస్మిక మృతితో సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందని విక్టరీ వెంకటేష్ తెలిపారు. దాసరి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా ఆయన ముందుండే వారని చెప్పారు. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం వెతికే దాసరి లేరన్న వార్త సినీ పరిశ్రమకు అశనిపాతమని ఆయన పేర్కొన్నారు.

దాసరి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకులకు స్టార్‌ డమ్ తీసుకొచ్చిన వ్యక్తి దర్శకరత్న దాసరి నారాయణరావు అని కొనియాడారు. ఒక దర్శకుడిగా దాసరి అన్నిరకాల సినిమాలు తీశారని అన్నారు. దాసరి ఒకేరోజు నాలుగైదు సినిమాలకు దర్శకత్వం వహించేవారని ఆయన తెలిపారు. దాసరి అసమాన ప్రతిభావంతుడని ఆయన తెలిపారు. దాసరి తమ కుటుంబ స్నేహితుడని ఆయన చెప్పారు.

DNR (144)

25 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో దాసరితో ప్రత్యేక అనుబంధం ఉందని గీత రచయిత సుద్ధాల అశోక్ తేజ అవేదనతో అన్నారు. ఇన్నేళ్లుగా గూడుకట్టుకున్న బంధం ఒక్కసారిగా తెగిందంటే నమ్మబుద్ధి కావడం లేదని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమకు లోటు ఒక ఎత్తైతే…ఇకపై కష్టం కలిగిన సినీ కుటుంబం ఎవరికి చెప్పుకోగలుగుతుందని ఆయన అన్నారు. సినీ పరిశ్రమలో ఎంతో మందికి దాసరి పెద్దదిక్కు అన్న సుద్దాల.. ఎంతోమందికి కుటుంబ సభ్యుడని విలపించారు.

దాసరి వ్యక్తిగతంగా తనకు స్నేహితుడని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య తెలిపారు. దాసరి పార్థివ దేహాన్ని సందర్శించేందుకు వచ్చిన రోశయ్య మాట్లాడుతూ, తామిద్దరం చాలా సార్లు కలుసుకుని, మాట్లాడుకునేవారమని అన్నారు. మిత్రుడ్ని కోల్పోవడం బాధగా ఉందని ఆయన తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు తెలుగు సినిమాలకు సంబంధించిన షూటింగ్ లన్నీ రద్దయ్యాయి. నేటి ఉదయం 10 గంటలకు దాసరి నారాయణరావు పార్థివదేహాన్ని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ కు తీసుకెళ్లనున్నారు. అక్కడ సుమారు రెండు గంటలపాటు అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు చేవెళ్ల సమీపంలో గల మొయినాబాద్ లోని దాసరి నారాయణరావు ఫాం హౌస్ లో ఆయన భార్య దాసరి పద్మ అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశం సమీపంలోనే ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించనున్నారు.

- Advertisement -