అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల ప్రకటించడంలో టీడీపీ వేగం చూపిస్తోంది. పొత్తులో భాగంగా 144 స్థానాల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలో భాగంగా ఇప్పటికే 94 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇక తాజాగా మరో 34 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం మీద 128 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేయగా మరో 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే మొత్తం టీడీపీ ప్రకటించిన స్థానాల్లో కొత్తవారికి, యువతకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న చాలామందిని చంద్రబాబు పక్కన పెట్టారు.
టీడీపీ హయంలో మంత్రి పదవులు అనుభవించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఎస్ జవహర్, దేవినేని ఉమా, బండారు సత్యనారాయణ, ఆలపాటి రాజా, గంటా శ్రీనివాస రావు, కొమ్మలపాటి శ్రీధర్ రెడ్డి వంటి వారిని పక్కన పెట్టేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అయితే వీరిని పొత్తులో భాగంగా పక్కన పెట్టేశారా ? లేదా సీనియర్లను కావాలనే ఫెడ్ అవుట్ చేస్తున్నారా ? అనేది టీడీపీ వర్గంలో జరుగుతున్న చర్చ. ఈసారి సీట్ల కేటాయింపులో దాదాపు 60 శాతం కొత్తవారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు.
ఆయన చెప్పినట్లుగానే దాదాపు చాలమంది కొత్తవారిని బరిలో దించుతున్నారు. అయితే టికెట్ లభించని సీనియర్లు అధిష్టానం వైఖరిపై ఎలా రియాక్ట్ అవుతారనేది చర్చనీయాంశంగా మారింది. గంటా శ్రీనివాస్ వంటి వారు టీడీపీకి గుడ్ బై చెబుతారని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సెకండ్ లిస్ట్ లో కూడా ఆయన పేరు లేకపోవడంతో ఆయన పార్టీ వీడతారనే వాదన మరింత ఎక్కువైంది. ఇక మిగిలిన సీనియర్ల అసంతృప్తి కారణంగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగే అవకాశం లేకపోలేదు. మరి పెండింగ్ లో ఉన్న 16 స్థానాల్లో సీనియర్స్ కు చోటు కల్పిస్తారా ? లేదా ఆ స్థానాల్లో కూడా కొత్త వారినే బరిలోకి దించుతారా ? అనేది చూడాలి.