రిలయన్స్ జియో ప్రవేశంతో భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దానికి కారణం రిలయన్స్ జియోనే… ఉచిత ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలకు చుక్కలు చూపించింది. జియో దెబ్బకి ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫొన్,లాంటి బడా కంపెనీలు సైతం లబోదిబోమన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే..జియో సంచలన ఆఫర్లు ప్రకటించడంతో అన్ని టెలికం కంపెనీల షేర్లు కుప్పకూలిపోయాయి.
అయితే టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించి, ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా అనే ప్రకటనతో కోట్ల మంది ప్రజలను తన వైపు తిప్పుకుంది జియో. ఇదిలాఉంటే..జియో ఆఫర్లని చూసి ఓ చిరు వ్యాపారికి కూడా ఓ ఐడియా తట్టింది. మార్కెట్ ని షేక్ చెయ్యాలంటే..కత్తిలాంటి ఐడియాలను ఉపయోగించాల్సిందే అనుకున్నాడో ఏమోగానీ..ఆ చిరు వ్యాపారి కూడా సరిగ్గా ఇదే సూత్రాన్ని వంట బట్టించుకున్నాడు. అందుకనే తన వద్దకు వచ్చే కస్టమర్లకు వినూత్నమైన ఆఫర్‌ను ప్రవేశపెట్టాడు. ఇంతకీ అదేంటో తెలుసా..?
అతని పేరు రవి జగదాంబ. ఉంటున్నది గుజరాత్‌లోని పోరు బందర్. ఇతనిది పానీ పూరీ వ్యాపారం. దానిపైనే ఆధార పడి జీవిస్తున్నాడు. పానీ పూరీ అమ్మగా వచ్చే డబ్బు తోనే అతను కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే రవి వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండేది.
దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతను తాజాగా ఓ ఆలోచన చేశాడు. వెంటనే ఆ ఐడియాను అమలులో పెట్టేశాడు. ఇంతకీ ఆ ఐడియా ఏంటంటే… రిలయన్స్‌కు చెందిన జియో ఆఫర్లు ఎప్పటికప్పుడు వస్తున్నాయి కదా. వాటిని చూసే రవికి ఓ ఆలోచన వచ్చింది. తాను కూడా తన దగ్గర పానీ పూరీ కోసం వచ్చే వారికి జియో ప్లాన్ మాదిరిగా రూ.100 చెల్లించి అపరిమిత పానీ పూరీ తినేలా ఆఫర్ పెట్టాడు.
రూ.100 చెల్లిస్తే చాలు తన వద్ద ఎవరైనా ఎంతైనా పానీ పూరీ తినవచ్చని అంటున్నాడు. అదే నెల మొత్తానికి ఎంతైనా తినాలంటే ఒకేసారి రూ.1వేయి చెల్లించాలని బోర్డు పెట్టాడు. దీంతో అతని బిజినెస్‌కు మంచి స్పందన వచ్చింది. అంతకు ముందు కన్నా ఇప్పుడు ప్రవేశపెట్టిన జియో పానీ పూరీ ఆఫర్‌తో అతని వ్యాపారం రెట్టింపు లాభంతో జరుగుతుందట. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అయితే ఇతనే కాదు, గతంలోనూ కరీంనగర్ కు చెందిన కొందరు రైస్ మిల్లర్లు జియో రైస్ అంటూ వ్యాపారం మొదలు పెట్టి అందరినీ ఆకర్షించారు. ఇలా చూస్తూ పోతే… ఇంకా ఎందరు ఇలా జియో ఆఫర్‌ను వాడుకుంటారో కదూ..!