టీడీపీ జనసేన మధ్య ‘తెనాలి చిచ్చు’!

25
- Advertisement -

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ జనసేన మద్య సీట్ల విషయంలో రగడ మొదలైనట్లు తెలుస్తోంది. వైసీపీని గద్దె దించే లక్ష్యంతో కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఇంకా ఎటు తేల్చుకోలేకపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన పార్టీ 30-40 సీట్లను డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. కానీ ఆ స్థాయిలో సీట్లు కేటాయించేందుకు చంద్రబాబు నిరాకరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మెజార్టీ స్థానాలను పవన్ డిమాండ్ చేస్తున్నారట. అయితే ఉత్తరాంధ్రలో టీడీపీకి కూడా బలమైన స్థానాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నిటిని జనసేనకు కట్టబెడితే టీడీపీకి నష్టం జరుగుతుందనే ఆందోళనలో టీడీపీ శ్రేణులు ఉన్నారు. .

పైగా జనసేన కచ్చితంగా ఆయా సీట్లలో గెలుస్తుందనే నమ్మకం కూడా టీడీపీ శ్రేణుల్లో లేదట. అందుకే జనసేన పార్టీకి 10-15 సీట్లలో సర్ధుబాటు చేయాలని టీడీపీలోని ఓ వర్గం చంద్రబాబుకు సూచిస్తున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో ఆల్రెడీ జనసేన అభ్యర్థిని ప్రకటించిన తెనాలి నియోజక వర్గంలో టీడీపీ జనసేన మద్య ముసలం మొదలైనట్లు తెలుస్తోంది. తెనాలి నియోజకవర్గం నుంచి నాదెండ్ల మనోహర్ ను బరిలో దించుతున్నట్లు పవన్ గతంలోనే ప్రకటించారు.

ఇప్పుడు పొత్తులో భాగంగా అక్కడ టీడీపీ పోటీ చేయకపోతే నష్టం తప్పదని కొందరు టీడీపీ శ్రేణులు భావిస్తున్నారట. అందుకే టీడీపీ తరుపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తెనాలి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తోంది పార్టీలోని ఓ వర్గం. ఈ ప్రభావం మిగిలిన సీట్లపై కూడా పడే అవకాశం లేకపోలేదు. పొత్తులో భాగంగా కేటాయించే సీట్ల విషయంలో ఇరు పార్టీల మధ్య సమన్వయం లోపిస్తే ఎన్నికల నాటికి ఇరు పార్టీల మద్య రగడ మరింత ముదిరే అవకాశం ఉంది. మరి అధినేతలు ఈ సమస్యను ఎలా సరిచేస్తారో చూడాలి.

Also Read:ప్చ్.. చిన్న హీరో కాబట్టే, చిన్న చూపు

- Advertisement -