రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలు సహా పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి మానవీయకోణంలో నిర్ణయం తీసుకున్నారు. గురుకుల హాస్టల్లలో చదువుకునే విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం వసతులను అందించేందుకు ప్రస్తుతం అందిస్తున్న డైట్ చార్జీలను పెంచుతూ సంబంధిత ఫైలు మీద సచివాలయంలోని తన ఛాంబర్ లో సీఎం శ్రీ కేసీఆర్ సంతకం చేశారు.
పెరిగిన డైట్ చార్జీలు జూలై నెల నుండి అమలులోకి రానున్నాయి.
ఈ మేరకు పెరిగిన డైట్ చార్జీల వివరాలు:
▪️3వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు అందిస్తున్న రూ. 950 ల డైట్ చార్జీలు రూ. 1,200 కు పెరిగాయి.
▪️8వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు అందిస్తున్న డైట్ చార్జీలు రూ.1,100 నుంచి రూ.1,400 లకు పెరిగాయి.
▪️11వ తరగతి నుండి పీ.జీ దాకా చదువుతున్న విద్యార్థులకు ప్రస్థుతం నెలకు అందిస్తున్న డైట్ చార్జీలు రూ.1,500 నుంచి రూ.1,875 లకు పెరిగాయి.
(కాగా డైట్ చార్జీల పెరుగుదల కోసం సీఎం శ్రీ కేసీఆర్ మంత్రుల సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కసరత్తు అనంతరం సీఎంకి సబ్ కమిటీ నివేదిక సమర్పించింది. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచింది.)
Also Read:ఆ పది పార్టీల దారెటు?
పెరిగిన డైట్ చార్జీల ద్వారా… ట్రైబల్ వెల్పేర్, ఎస్సీ వెల్పేర్, బిసి వెల్పేర్ గురుకులాలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలు తదితర మొత్తం గురుకులాల్లోని దాదాపు 7 లక్షల 50 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నదని సీఎం తెలిపారు. ప్రస్థుతం అందిస్తున్న చార్జీలకు అదనంగా 26 శాతం చార్జీలు పెరిగాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపు మరో 237.24 కోట్ల రూపాయల మేరకు అదనపు భారం పడనున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడే అదనపు భారాన్ని లెక్కచేయకుండా రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం శ్రీ కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హాస్టల్లల్లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం సన్నబియ్యంతో అన్నం పెడుతూ వారికి నాణ్యమైన విద్యతో పాటు చక్కటి భోజనాన్ని కూడా ఇప్పటికే అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు మరింత గొప్పగా భోజన వసతులను కల్పించాలని అందుకు అనుగుణంగా చార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. డైట్ చార్జీలు పెంచుతూ ఫైలుపై సంతకం చేసిన సందర్భంగా గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:పవన్ క్యారెక్టరే జగన్ టార్గెట్ ?