పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై భాజపా నేత శ్యామపాద మండల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ సీఎం మమతా బెనర్జీ ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మానసిక పరిస్థితి సరిగా లేదని ఆమెను త్వరలోనే రాంచీలోని ప్రముఖ మానసిక వైద్యశాలకు వెళ్లాల్సివస్తుందంటూ.. పశ్చిమ మిడ్నాపూర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో శ్యామపాద మండల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
శారద చిట్‌ఫండ్ కుంభకోణం, నారదా స్టింగ్ ఆపరేషన్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేతల పాత్రలపై మమతాబెనర్జీ సమాధానం చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ‘ఆమె మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. మరి కొద్ది రోజుల్లో ఆమెను రాంచీలోని ప్రముఖ మానసిక వైద్యశాలలో చేర్చాల్సి ఉంటుంది’ అని శ్యామపాద అన్నారు.
అయితే తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ భాజపా నేత శ్యామపాద మండల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రాజకీయ వాతావారణాన్ని చెడగొట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని, ఇటువంటి అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తూ వ్యాఖ్యలు చేసి పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
అంతేకాకుండా ఇది పశ్చిమ్‌బంగా అని గుర్తుంచుకోవాలన్నారు పార్థ ఛటర్జీ. బీజెపీ ఎత్తుగడ ఇక్కడ అంత సులువుగా సాధ్యపడదని, ప్రజలు అటువంటి వాళ్లకు తగిన సమాధానం చెప్తారని ఛటర్జీ మండిపడ్డారు.