రామ్ గోపాల్ వర్మకి వైరస్ సోకిందట. అంతేకాదు ..వర్మ హాస్పిటల్ లో కూడా చేరాడట. ఏంటీ.. నమ్మలేకపోతున్నారా..? ఉదయం కూడా ఎంచక్కా ట్వీట్లు చేస్తూ కనిపించిన వర్మకు సడెన్ గా ఏమైందని కంగారు పడుతున్నారా? వర్మ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే..వర్మకి వైరస్ సోకడం నిజమే. హాస్పిటల్ లో చేరింది కూడా నిజమే..ఇలా అని వర్మనే చెప్పాడు. ఎందుకంటే..వర్మ చేసే ట్విట్ల జిమ్మిక్కుల్లో ఇది కూడా ఒకటి.
అయితే వర్మ కు సోకిన ఆ వైరస్ పేరు.. బాహుబలి2 జలసైటిస్ అంటున్నాడు వర్మ. అంటే బాహుబలి-2ను చూసి అసూయతో రగిలిపోవడం వల్ల వచ్చే వ్యాధి అన్నమాట ఇది. తాను ఒక్కడే కాదని.. దేశవ్యాప్తంగా మరెందరో ఫిలిం మేకర్స్ అనేక చోట్ల ఆస్పత్రుల్లో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వర్మ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు.
ఇక మొదటి నుంచి బాహుబలి పై తనదైన స్టైల్ లో ట్వీట్స్ పెడుతూనే ఉన్నాడు వర్మ. అంతేకాకుండా బాహుబలి2 రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ..ఈ సినిమా గురించి, రాజమౌళి గురించి వర్మ తెగ ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే స్పీడ్ ని బాహుబలి2 రిలీజ్ తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నాడు.
ఇక బాహుబలిని చూసి బాలీవుడ్ వాళ్లు అదిరిపోతున్నారంటూ రెండు మూడు రోజులుగా వర్మ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. బాహుబలి శబ్దాన్ని తట్టుకోలేక బాలీవుడ్ డైరెక్టర్లు.. హీరోలు చెవుల్లో దూది పెట్టుకున్నారని.. బాహుబలి దెబ్బకు వాళ్లు వణికిపోతున్నారని.. ఇంకా తన మార్కుతో అనేక ట్వీట్లు చేశాడు వర్మ.
అయితే వర్మ వ్యాఖ్యలు కొంచెం అతిగా అనిపించడం వాస్తవమే అయినా.. నిజంగానే ‘బాహుబలి’ ప్రభంజనం బాలీవుడ్ దర్శకుల్లో ఆందోళన.. అసూయను పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
కనీసం వేరే దర్శకులు ఊహించడానికి కూడా భయపడే స్థాయిలో ‘బాహుబలి-2’లోని కొన్ని సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు రాజమౌళి. ఇందులోని మైనస్ పాయింట్లను ఎత్తి చూపేవాళ్లు కూడా సినిమా గురించి పూర్తి నెగెటివ్ గా అయితే మాట్లాడలేరు. ఏదేమైనా ఈ సినిమా చూసి కొంతమంది అసూయపడితే మాత్రం వర్మ చెప్పిన మాటల్ని నిజం చేశారనే అనుకోవాలి.