రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలకు చుక్కలు చూపించింది. జియో దెబ్బకి ఎయిర్టెల్, ఐడియా, వొడాఫొన్,లాంటి బడా కంపెనీలు సైతం లబోదిబోమన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే..జియో సంచలన ఆఫర్లు ప్రకటించడంతో అన్ని టెలికం కంపెనీల షేర్లు కుప్పకూలిపోయాయనే చెప్పాలి. అయితే టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించి, ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా అనే ప్రకటనతో కోట్ల మంది ప్రజలను తన వైపు తిప్పుకుంది జియో.
అంతేకాకుండా నెట్‌వర్క్‌లో ది బెస్ట్ అనిపించుకున్న ఎయిర్టెల్ జియో రాకతో తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఎయిర్టెల్ తర్వాత ఐడియా, వొడాఫోన్ కూడా నష్టాన్ని చవిచూశాయి. అయితే ఎప్పటి నుంచో జియో ఆఫర్లను ఎయిర్టెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. సెల్యులర్ ఆపరేటర్స్ ఇండియా నివేదిక ప్రకారం గత అక్టోబర్‌తో పోల్చుకుంటే ఎయిర్టెల్ తీసుకునే కొత్త కస్టమర్ల సంఖ్య నెలకు 5శాతం తగ్గిపోయింది.
జియో టారిఫ్ తక్కువగా ఉండటం, ఫ్రీ ఆఫర్లు ప్రకటించడంతో ఎయిర్టెల్ కంటే జియోనే బెటరనే భావనకు కొందరు వచ్చేశారు. నవంబర్ నెలలో అప్పటివరకూ నెలకు 2.33 మిలియన్ల మంది ఎయిర్టెల్ సబ్‌స్రైబర్లుగా మారే వారు కాస్తా.. 1.08 మిలియన్లకు పడిపోయారు. ఇక వొడాఫోన్ పరిస్థితి ఎయిర్టెల్ కంటే దారుణంగా ఉంది. అక్టోబర్‌లో 1.17 మిలియన్ల మంది వొడాఫోన్ నెట్వర్క్ తీసుకున్నారు.
నవంబర్‌లో అది కాస్తా 8,90,794కు పడిపోయింది. ఈ ఫిబ్రవరి నెలకు అది మరింత క్షీణించి 7,92,063కు దిగజారింది. ఐడియా నెట్వర్క్ కూడా జియో వల్ల కొత్త సబ్స్రైబర్స్ను భారీగా కోల్పోయింది. అందుకే ఈ మూడు కంపెనీలు అవకాశం దొరికినప్పుడల్లా జియోపై విరుచుకుపడుతున్నాయి. చూశారా..రిలయన్స్ ఇచ్చిన ఆఫర్లకి ప్రత్యర్థి కంపెనీలకు దిమ్మతిరిగిపోయినట్టైంది కదూ..!