ప్రముఖ నేపథ్య గాయిని వాణీ జయరాం (77) ఈ రోజు హఠాన్మరణం చెందిన సంఘటన తెలిసిందే. ఐతే, వాణీ జయరాం మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాణీ జయరాం ముఖంపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాణీ జయరాం ఇంటిని కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈమేరకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఉదయం ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం తలుపు తీయలేదని పోలీసులకు పనిమనిషి తెలిపారు. తలుపు బద్దలు కొట్టి చూస్తే.. వాణీ జయరాం చనిపోయి ఉన్నారు. పైగా వాణీ జయరాం నుదురు, ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలు ఉన్నాయట. ప్రస్తుతం ఈ విషయం పై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక వాణీ జయరాం సినీ కెరీర్ విషయానికి వస్తే.. కళాతపస్వి కే. విశ్వనాథ్ చిత్రాలలో వాణి జయరాం ఎక్కువ పాటలు పాడారు. శంకరాభరణం చిత్రంలో ఆమె 5 పాటలు పాడారు. ఈ పాటలకు జాతీయ అవార్డు, నంది అవార్డులు కూడా వచ్చాయి. సీతామాలక్ష్మి, శ్రుతిలయలు, స్వాతికిరణం తదితర చిత్రాల్లో కూడా ఆమె పాటలు పాడారు. స్వాతికిరణంలో పాటలకు మరోసారి జాతీయ అవార్డు లభించింది. ముఖ్యంగా వాణీ జయరాం పాడిన పూజలు చేయ, ఎన్నెన్నో జన్మలబంధం లాంటి పాటలు బాగా అలరించాయి.
ఆమెకు జనవరిలో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అంతలోనే వాణీ జయరాం చనిపోవడం దురదృష్టకరం. వాణి జయరాం దాదాపు వెయ్యి సినిమాల్లో 20వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె దాదాపు 5దశాబ్దాలుగా తన గాత్రాన్ని అందించారు.
ఇవి కూడా చదవండి…