తెలంగాణే ఎజెండా…కేసీఆర్ సరికొత్త వ్యూహం

177
kcr
- Advertisement -

తెలంగాణ గడ్డపై ఉద్యమ పార్టీగా చరిత్ర సృష్టించిన టీఆర్‌ఎస్‌ అక్టోబర్‌ 5, 2022 న బీఆర్‌ఎస్‌ ( భారత్‌ రాష్ట్ర సమితి ) గా ఆవిర్భవించింది. జాతీయ స్థాయిలో రాష్ట్రాలపై కేంద్రం చేస్తున్న కుట్రలు, మత రాజకీయాలు, ప్రభుత్వ పరిశ్రమలను ప్రయివేటుగా మార్చడం, పేదలను దోచి పెద్దలకు పంచడం వంటి దుర్మార్గమైన రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై తిరగబడ్డ విషయం తెలిసిందే. దేశ రాజకీయాలను పూర్తిగా మార్చాలనే ఉద్దేశ్యంతో జాతీయ రాజకీయ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఓ వెలుగు వెలిగిన పార్టీ పేరును బీఆర్‌ఎస్‌ గా మార్చారు. దేశం స్వాతంత్ర్యం పొంది ఇన్నేళ్లయినా.. ఏ ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోలేదని, దేశమంతటా తెలంగాణ మోడల్‌ లా తయారు చేస్తానన్న హామితో ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ఇష్టాతీరిన పాలన చేస్తోంది. రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తూ తాము చెప్పినట్టు వింటే ఒకలా.. లేదంటే మరోలా ఉంటుందని శాసిస్తోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ పరిశ్రమలన్నింటిని ప్రయివేటుగా మారుస్తూ అదానీ, అంబానీ వంటి బడాబాబులకు ధారాదత్తం చేయడం వంటివి చేయడం కేంద్రానికి పరిపాటిగా మారింది. ఈ క్రమంలో తమ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న, జరగబోయే అన్యాయాలపై ముఖ్యమంత్రిక కేసీఆర్‌ కేంద్రంపై పోరుకు సిద్ధపడ్డారు. కేంద్రంలో ఉన్నది రైతు, పేదల వ్యతిరేక ప్రభుత్వమని ఢిల్లీ వేదికగా పలు సందర్భాల్లో కుండబద్దలు కొట్టి చెప్పారు సీఎం కేసీఆర్‌. అప్పటినుంచి తెలంగాణపై, సీఎం కేసీఆర్‌పై కక్షసాధింపు దోరణితో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రగతిని అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అవకాశం చిక్కినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతూ వస్తోంది. ఈ క్రమంలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన కౌశిక్‌ రెడ్డిని గవర్నర్‌ తమిళిసై కావాలనే అడ్డుకోవడం అప్పట్లో సంచలనమే సృష్టించింది.

ఈ విషయంలో గవర్నర్‌ ఓ బీజేపీ కార్యకర్తలా వ్యవహరించడం దారుణమని యావత్‌ తెలంగాణ సమాజం చీదరించుకుంది. ఓ వైపు గవర్నర్‌ రాష్ట్రంలో నియంతలా వ్యవహరిస్తుండగా, ఇంకో వైపు ఢిల్లీ వేదికగా పంజాబ్‌ రైతులు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని తలపెట్టిన ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఈ ఉద్యమానికి సీఎం కేసీఆర్‌ సంపూర్ణ మద్దతు తెలపడంతో కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రంపై మరింత ఆగ్రహం పెరిగింది. దీంతో యాసంగి ధాన్యాన్ని కొనబోమని తేల్చిచెప్పింది. ఇలా ప్రతిసారి ఏదో ఒక రూపంలో కేంద్రం తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలన్నింటిని ఇబ్బందులకు గురిచేస్తూనే వస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ, పంజాబ్‌ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటికే కేంద్రంతో కొట్లాడుతున్న ఆప్‌ ప్రభుత్వంతో పాటు పంజాబ్‌ రైతులుకు కేసీఆర్ దగ్గర కావడం కేంద్రానికి మింగుడుపడడం లేదు. ఆ తర్వాత క్రమంలో రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు సీఎం కేసీఆర్‌ స్వయంగా వెళ్లి చెక్కులిచ్చి ఆదుకున్నారు. అయితే కేంద్రం ఒక్కో రాష్ట్రాన్ని టార్గెట్‌ చేస్తుండడం, తాము చెప్పినట్టు వినకపోతే తమ పరిధిలో ఉన్న సీబీఐ, ఇడి, ఐటీ, వంటి సంస్థలను ప్రయోగించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్‌ జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలను ఒక్క తాటిపైకి తెచ్చేలా ఆయా రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాల ముఖ్యమంత్రులను కలిసి చర్చలు జరిపారు.

ఈ దశలో కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ ఓ కొత్త పిచ్చి వాదనను తెరపైకి తెచ్చింది. అయితే ఏ రాష్ట్రము బయటకు చెప్పలేకపోయినా.. దీనిని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. అవసరమైతే తల నరుక్కుంటాం.. కానీ మోటార్లకు మీటర్లు పెట్టబోం అని తేల్చి చెప్పారు. ఓ వైపు కేంద్రంతో తలపడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్‌ వన్ స్థాయికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌కు ఇంట బయటా ఆధరణ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఇతర రాష్ట్రాల ప్రజలను సైతం ఆకర్షిస్తున్నాయి. మన పక్కనే ఉన్న ఆంధ్రా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలంటూ ఉద్యమాలు చేశారంటే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇక కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, ఇతర రాష్ట్రాల ప్రజల డిమాండ్‌ తో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. రానున్న రోజుల్లో చెప్పినట్టుగానే, ఇచ్చిన మాట ప్రకారం దేశాన్ని తెలంగాణ మోడల్‌ గా తయారు చేయడం ఆయనకు పెద్ద పనేం కాదు. ఇప్పటికే దేశంలోని సమస్యలు, అభివృద్ధిపై సమగ్ర ప్రణాళిక రూపొందించుకుని దేశాన్ని గుజరాత్‌ మోడల్‌ గా కాకుండా.. బంగారు భారత్‌ గా చేసేందుకు రెఢీగా ఉన్నారు.

- Advertisement -