శివసేన చీలిక జరిగిన తర్వాత ఆ పార్టీలో నాయకత్వ హక్కుల కోసం మాజీ సీఎం ఉద్దవ్ మరియు చీలిక వర్గ నేత ఏక్ నాథ్ షిండే మద్య నెలకోన్న పోరు ఇప్పుడు ఎన్నికల సంఘానికి చేరింది. అసలైన శివసేన తమ దేనని ఆ పార్టీ నియంత్రణను తమకు అప్పగించాలని కోరుతూ ఇటీవల శిండే నేతృత్వంలోని చీలిక వర్గం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. శివసేన పార్టీ కోసం మెజార్టీ నిరూపించుకోవాలంటూ ఈసీ ఇరు వర్గాలను ఆదేశించింది. అందుకు సంబందించిన పత్రాలను ఆగస్టు 8వ తేదీలోగా సమర్పించుకొవాలని సూచించింది.
ఇటీవలే మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకోన్న సమయంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంను కూలదోసి చీలిక వర్గ నేత షిండే, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే మెజార్టీ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని అసలైన శివసేన తమదేనంటూ శిండే వర్గం చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటివలే లోక్‌సభలోను శివసేనకు చేందిన 18 మంది ఎంపీల్లో 12 మంది శిండే వర్గంలో చేరడంతో చీలిక వర్గానికి మరింత బలం చేకూరింది.
చీలిక వర్గ నేత షిండే శివసేన పార్టీని తమకు అప్పగించాలని కోరుతూ ఈసీకి లేఖ రాశారు. ఇదే క్రమంలో ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈసీకి లేఖ రాశారు. ఇరుపక్షాల నేతలు విల్లు-బాణం గుర్తు తమకే కేటాయించాలని ఈసీని కోరుతున్నాయి . ఇరు పక్షాల వాదనలను పూర్తిగా విన్న ఈసీ ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట లోపు నివేదిక సమర్పించాలని ఇరువర్గాలను సూచించింది. అంతేగాక పార్టీలో విభేదాలపై పూర్తి వివరణ ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత ఈసీ రాజ్యాంగ కమిటీ దీనిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. త్వరలో మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ నిర్ణయం కీలకంగా మారనుంది.