మరో వివాదంలో జీవితా రాజశేఖర్‌..!

139
Jeevitha Rajasekhar
- Advertisement -

జీవిత రాజశేఖర్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఆమె డైరెక్ట్ చేసిన ‘శేఖర్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన కూతుళ్ళ గురించి మాట్లాడుతూ ఓ సమెత చెప్పింది. దీంతో అదికాస్తా కాంట్రవర్సీకి దారితీసింది. ఈవెంట్‌లో శివానీ, శివాత్మిక ఇద్దర్లో ఎక్కువ ఎవరు ఖర్చు పెడతారని యాంకర్ ప్రశ్నించగా.. ఇద్దరూ ఫుడ్ మీద ఎక్కువగా ఖర్చు చేస్తుంటారని జీవిత చెప్పారు.

శివానీ పేరు స్విగ్గీ వాళ్లకు బాగా తెలుసని.. కొంచెం లేట్ అయినా ఆమె ఒప్పుకోదని.. దానిది కోమటిదాని లెక్కని.. డబ్బులు ఇచ్చేంత వరకు వాళ్లను వదిలిపెట్టదని జీవిత వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా మాట్లాడారని, తమ కులానికి పిసినారితనాన్ని ఆపాదించేలా కామెంట్ చేశారని ఆర్యవైశ్యులు జీవితపై మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. తనపై వచ్చిన వివాదాల గురించి వివరణ ఇచ్చారు. ఏదైనా ఇష్యూ వస్తే మాట్లాడటం తప్పితే.. ఎవరినైనా మోసం చేయడం గానీ.. ఎవరికైనా అన్యాయం చేసినట్లు చూసారా?.. అయినా తనపైన వచ్చినన్ని వార్తలు.. ఆరోపణలు మరెవరి మీద రావని ఆవేదన వ్యక్తం చేసింది.

తనకు ఆర్యవైశ్యులంటే చాలా గౌరవం ఉందని చెప్పారు. వారిని కించపరచాలని తాను మాట్లాడలేదని… కోమటివాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారని, డబ్బుకు విలువనిస్తారని, చాలా పద్ధతిగా ఖర్చు చేస్తారని, సంపాదనలో కొంత మొత్తాన్ని దానధర్మాలు చేస్తారని, దేవుడి హుండీల్లో వేస్తారని అన్నారు.డబ్బులు జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి.. ‘కోమటోళ్ల లెక్క’ అనే నానుడిని ఎప్పటి నుంచో వాడుతున్నారని… తాను కూడా ఆ ఉద్దేశంతోనే మాట్లాడానని, ఆర్యవైశ్యులను కించపరిచేందుకు కాదని చెప్పారు.

ఆర్యవైశ్యుల గొప్ప క్వాలిటీని చెపుతూనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. శివానీ ఒక్క పైసాను కూడా వదులుకోదని… కోమటోళ్ల మాదిరి జాగ్రత్తగా ఉంటుందనే ఉద్దేశంతోనే మాట్లాడానని చెప్పారు. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ వివాదంపై లైవ్ డిబేట్ పెట్టిన న్యూస్ ఛానల్ వారికి తనతో 25 ఏళ్లుగా పరిచయం ఉందని.. ఒక్కసారి తనని దీనిపై క్లారిటీ అడిగుంటే ఇది వివాదంగా మారి ఉండేది కాదని జీవిత రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

- Advertisement -