ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.హనుమకొండ, వరంగల్, నర్సంపేటలో రూ.236 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా హనుమకొండ, ఓరుగల్లు నగరాలు గులాబీమయంగా మారిపోయాయి. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి.. నగరానికి రెండు వైపులా జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన 20 వేల మంది టీఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తలతో హయగ్రీవచారి గ్రౌండ్‌లో నిర్వహించనున్న సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్లూఎంసీ)లో రూ.27 కోట్లతో పూర్తయిన పనులను ప్రారంభిస్తారు. మరో రూ.150 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.11.50 కోట్లతో అభివృద్ధి చేసిన పబ్లిక్ గార్డెన్స్, రూ.1.5 కోట్లతో ఆధునీకరించిన రీజినల్ లైబ్రరీని ప్రారంభిస్తారు. నర్సంపేటలో ఇంటింటికీ గ్యాస్ సరఫరా కోసం పీఎన్‌జీ గ్యాస్ లైన్‌ను ప్రారంభిస్తారు.