ఆదివారం భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో ప్రసంగించారు. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతులు పెరిగాయన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇటీవల భారతీయులు గర్వించే విధంగా ఒక ఘనతను సాధించామని ఆయన అన్నారు. భారతదేశం 400 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని (30 లక్షల కోట్ల రూపాయల) సాధించిందని ఆయన చెప్పారు.
గతంలో ఎగుమతుల విలువ 100 బిలియన్ డాలర్లు, కొన్నిసార్లు 150 బిలియన్ డాలర్లు, కొన్నిసార్లు 200 బిలియన్ డాలర్లు ఉండేవని ఆయన చెప్పారు. ఇప్పుడు మాత్రం ఏకంగా 400 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆయన గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ వస్తువులకు డిమాండ్ పెరగడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.
మన సంకల్పాలు, ప్రయత్నాలు మనం కనే కలల కంటే గొప్పగా ఉంటే విజయం తప్పక వరిస్తుందని ఆయన అన్నారు. లడఖ్‌లోని నేరేడు పండ్ల నుండి, ఉస్మానాబాద్ నుండి చేనేత ఉత్పత్తుల వరకు భారతీయ ఉత్పత్తులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.