ఈ నెల 10వ తేదీన వరంగల్ నగరంలో జరగనున్న వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు.ఈ సమీక్షలో హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, గోపి, వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటరమణ, ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు, TSMSIDC DE రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
10వ తేదీన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రానున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లితో పాటు, సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.
ఈ సందర్భంగా ఎంజీఎం హాస్పిటల్లో రూ. 40 లక్షలతో…ఏర్పాటు చేసిన 42 పడకల చిన్న పిల్లల కోవిడ్ ప్రత్యేక సంరక్షణ విభాగం వార్డు (ఇందులో 30 పడకల జనరల్ వార్డు, 4 పడకల HDU వార్డు, 8 పడకల ICU వార్డు) ను మంత్రులు ప్రారంభిస్తారు. అలాగే హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి కేంద్రంలో రూ.25 లక్షల వ్యయంతో సమగ్ర చనుపాల నిర్వహణ కేంద్రంను ప్రారంభిస్తారు. ఇదే హాస్పిటల్లో రూ. 38 లక్షలతో ఏర్పాటు చేసిన రక్త నిధి కేంద్రంను ప్రారంభిస్తారు.
కాగా హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి కేంద్రంలో 1 కోటి 25 లక్షలతో ఏర్పాటు చేయనున్న నూతన డయాగ్నోసిస్ కేంద్రం భవనానికి మంత్రులు శంకుస్థాపన చేస్తారు.ఆయా పనులను సకాలంలో పూర్తి చేయాలని, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు అన్నీ సిద్ధం చేయాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు.