దేశ రక్షణ కోసం ప్రాణాలు వదిలిన మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం గువ్వని కుంట తండా పరశురామ్ నాయక్ యువత ఆదర్శమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గత సంవత్సరం దేశరక్షణ కోసం ప్రాణాలు వదిలిన పరశురాం కుటుంబానికి బుధవారం ఆయన గువ్వనికుంటా తాండాలో 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రొసీడింగ్ ను అందజేశారు. అంతేకాక రెండున్నర ఎకరాల పట్టా భూమి ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరశురామ్ నాయక్ దేశ రక్షణ కోసం చనిపోవడం బాధాకరమని, అయితే పరశురాం నాయక్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ,ప్రభుత్వం ఇచ్చిన భూమి లో బోరు మోటర్ వేయిస్తామని, ఇద్దరు పిల్లల్ని కేజీబీవీ, లేదా గురుకులాల్లో చదివిస్తామని, మహబూబ్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని, అంతేకాక మహమ్మదాబాద్ లో తల్లికి మరో ఇల్లు ఇస్తామని తెలిపారు. యువత పరుశురాం ను ఆదర్శంగా తీసుకొని బాగా చదువుకుని దేశ సేవలో నిమగ్నం కావాలని అన్నారు.
గతంలో తండాలు తాగునీటికి, విద్యుత్ కు చాలా సమస్యలు ఎదుర్కొన్నాయని ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దిందని, ఉచిత విద్యుత్, తాగునీరు, రైతు బంధు రైతు బీమా, పెన్షన్ వంటివి అందజేస్తున్నామని, పాలమూరు-రంగారెడ్డి ద్వారా జిల్లాలోని అన్ని భూములకు సాగు నీరు అందించి సస్యశ్యామలం చేస్తామని ,ఏడు సంవత్సరాల తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని మంత్రి అన్నారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .