దేశంలో బీజేపీ పాలనలో గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూ సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ నేతలు మాత్రం ధరల పెరుగుదలతో ఆదాయాలు పెరుగుతున్నాయి…అలాంటప్పుడు ధరలు పెరిగాయని మామీద పడి ఏడుస్తారెందుకు అంటూ ప్రజలపై నోరుపారేసుకుంటున్నారు. తాజాగా గతంతో పోలిస్తే ప్రజల ఆదాయాలు పెరిగాయి..అలాంటప్పుడు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పాత రేట్లకే రావాలని ఎందుకు గగ్గోలు పెడుతున్నారంటూ మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి మహేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ధరలు పెంచి సామాన్యుడి బతుకులు ఆగం చేసింది కాక..ధరల పెరుగుదలతో ఆదాయాలు పెరిగాయంటూ బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు సైతం మండిపడుతున్నారు.
తాజాగా ధరల పెరుగుదలపై బీజేపీ మంత్రి సిసోడియా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయన్నారు. వంట నూనెల ధరలు ఇటీవల రికార్డుస్ధాయిలో పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని సిబల్ ఎత్తి చూపారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వానికి పేదల గోడు పట్టదని మండిపడ్డారు. బీజేపీ మంత్రి ప్రజల ఆదాయం పెరిగిందని చెబుతున్నారని కానీ ఈ ఏడేళ్లలో బీజేపీ నేతల ఆదాయమే పెరిగిందని కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు. ఇంధన, గ్యాస్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నా.. ప్రజల ఇబ్బందులు పట్టించుకోని కాషాయ పాలకులు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, కాషాయ పార్టీ పతనం మొదలైందని సిబల్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తంగా ధరల పెరుగుదలపై ఎందుకు గగ్గోలు పెడతారంటూ ప్రజలపై నోరుపారేసుకున్న బీజేపీ మంత్రి మహేంద్ర సింగ్‌కు…. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కర్రు కాల్చి వాతపెట్టారనే చెప్పాలి.