హుజురాబాద్ ఉప ఎన్నికలకు పోలింగ్ దగ్గరపడుతుండడంతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున ప్రచారం చేసేందుకు తెలంగాణ బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితురాలు విజయశాంతి.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్న నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ సీనియర్ నేతలు రాజాసింగ్, మాజీ అధ‌్యక్షుడు లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డిలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఇప్పటివరకు బీజేపీ శాసనసభా పక్ష నేత రాజాసింగ్ జాడ లేదు. దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు, జీహెచ్ఎంపీ ఎన్నికల ప్రచారంలో రాజాసింగ్ పాల్గొన్నారు. కాని హుజురాబాద్‌లో మాత్రం ఆయన ఇంత వరకు అడుగుపెట్టలేదు.
అసలు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో రాజాసింగ్ పేరు ఎందుకు చేర్చలేదన్నది ఇప్పటికీ కాషాయకేడర్‌లో ఒక ప్రశ్నగా మిగిలింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మాజీ అధ‌్యక్షుడు లక్ష్మణ్, రాజాసింగ్ వర్గానికి కాకుండా బండి సంజయ్ తన వర్గానికి టికెట్లు కేటాయించడంతో వివాదం మొదలైంది. రాజాసింగ్ బహిరంగంగానే బండి సంజయ్‌ను విమర్శిస్తూ స్వయంగా ఓ వీడియో కూడా విడుదల చేశాడు. దీంతో బండికి, రాజాసింగ్‌కు మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఆ తర్వాత రాజాసింగ్ ఓ మెట్టు దిగి బండి సంజయ్‌తో సర్దుకుపోవడానికి ప్రయత్నించాడు. అయితే గ్రేటర్ ఎన్నికల సమయంలో తనపై చేసిన విమర‌్శలను మనసులో పెట్టుకున్న బండి సంజయ్ కావాలనే రాజాసింగ్‌కు హుజురాబాద్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో స్థానం కల్పించలేదని కాషాయ పార్టీలో చర్చ జరుగుతోంది. అంతే కాదు హుజురాబాద్‌లో రాజాసింగ్ ప్రచారానికి వస్తే ముస్లిం ఓటర్లు దూరం అవుతారనే భయంతో ఈటల రాజేందర్ సలహా మేరకు రాజాసింగ్‌ను దూరం పెట్టారని ఒక చర్చ జరుగుతోంది. ఇక బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సైతం ఇప్పటి వరకు హుజురాబాద్ వెళ్లలేదు.
27తో ఇక్కడ ప్రచారం ముగుస్తుంది. స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌లో లక్ష్మణ్ పేరు ఉంది కాని ఆయన కూడా బండితో విబేధాల నేపథ్యంలో ప్రచారానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇక బీజేపీ సీనియర్ నాయకుడు ఇంద్రసేనారెడ్డి సైతం హుజురాబాద్ బైపోల్ ప్రచారానికి దేరంగా ఉన్నా రు. బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించేంత వరకు యాక్టీవ్‌గా ఉన్న ఆయన.. జాబితాలో తన పేరు లేకపోవడంతో హర్ట్ అయినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా.. ఎన్నికల కమిషన్ వ్యవహారాలు చూసే ఇంద్రసేనారెడ్డి ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల టైమ్‌లో పార్టీ ఆఫీస్‌కు కూడా రావడం లేదట. వీరేకాకుండా .. బీజేపీ రాష్ట్ర పదాధికారుల్లో మరికొందరు సైతం హుజురాబాద్ ప్రచారానికి దూరంగా ఉండటం కాషాయ పార్టీలో కొత్త రచ్చకు దారి తీస్తోంది. బండి సంజయ్ కావాలనే తమనేతను పక్కనపెడుతున్నాడని రాజాసింగ్ వర్గీయులు మండిపడుతున్నారంట..అటు మాజీ అధ‌్యక్షుడు లక్ష‌్మణ్ కూడా బండి తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారంట..ఇంద్రసేనారెడ్డి సైతం తనకు జాతీయ కార్యవర్గంలో స్థానం దక్కకపోవడం వెనుక బండి సంజయ్ హస్తం ఉందని రగలిపోతున్నారంట..మొత్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ సీనియర్లు కనిపించకపోవడం కాషాయ పార్టీలో ఉన్న వర్గ విబేధాలను మరోసారి బయటపెట్టినట్లు అయింది.