అర్బన్ మిషన్ భగీరథ పతకం కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని కాలనీలకు తాగునీరు అందిస్తున్నామన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఈరోజు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అర్బన్ మిషన్ భగీరథపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రూ. 313 కోట్ల 26 లక్షల వ్యయంతో నలభై ఏడున్నర ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన 12 రిజర్వాయర్లను నిర్మించి, 384 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయడం ద్వారా ఎల్బీనగర్ నియోజకవర్గంలో తాగునీటి సరఫరాను మెరుగుపరిచామన్నారు. 13.11 కి.మీ. నీటి సరఫరా గల పైపులైన్ నెట్‌వర్క్‌ను రూ. 5 కోట్ల 25 లక్షల వ్యయంతో తాగునీరు అందని కాలనీలకు సమకూర్చాలని ప్రతిపాదన చేపట్టి, పూర్తి చేయడం జరిగిందన్నారు.
ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తాగునీటికి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 90 నుంచి 95 శాతం వరకు తాగునీటి సమస్య పూర్తయిందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని రైతుబజార్, వైదేహీ నగర్, సచివాలయ నగర్, ఆటోనగర్, ప్రశాంతి నగర్, సాహెబ్ నగర్, వాసవీ నగర్‌కు సంబంధించి.. 47 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు నిర్మించి నీటి సమస్యను తీర్చామన్నారు.