మంత్రి కేటీఆర్ శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును కేటీఆర్ ప్రారంభించారు. సమీకృత మార్కెట్‌కు, అమరవీరుల స్మారక పార్కుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్‌టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన చిల్డ్రన్స్, సైన్స్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఒక్కటైన పొరుగు రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయా? అని ప్రశ్నించారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ, పథకాలు పక్కనే ఉన్న కర్ణాటకలో అమలు అవుతున్నాయా? ఒక్కసారి నారాయణ పేట ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. భారతదేశంలో అత్యధికంగా వరి పంట పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది అని కేటీఆర్ గుర్తు చేశారు. ఊహించని విధంగా వరి పంట పండింది.. రైతుల దగ్గర పంట కొన్నాము అని తెలిపారు.
వ్యవసాయ అనుబంధ పరివ్రమలు నెలకొల్పుతామన్నారు. గతంలో పాలమూరులో 14 రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేవి.. ఇప్పుడు రోజు తప్పించి రోజు మంచినీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ భవనాల నిర్మాణం కూడా చేపడుతామన్నారు. రాజకీయాలకు అతీతంగా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి ముందు తరాలకు మంచి భవిష్యత్‌ను అందివ్వాలి అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.