బాహుబలి డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం నుంచి ఈరోజు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. దీంట్లో ఎన్టీఆర్ బైక్ నడుపుతుండగా, రామ్ చరణ్ వెనుక కూర్చుని ఉండడం చూడొచ్చు. ఇద్దరూ జాలీ మూడ్ లో ఉన్నట్టు వాళ్ల హావభావాలు చెబుతున్నాయి. అయితే, ఇది సినిమా స్టిల్ అయినా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ సృజనాత్మకను చూపిస్తూ, ఈ ఫొటో సాయంతో ప్రజల్లో హెల్మెట్లపై అవగాహన పెంచేందుకు ప్రయత్నించారు.
పోస్టర్‌లో బైక్ నడుపుతున్న జూనియర్ ఎన్టీఆర్.. వెనక కూర్చున్న రామ్ చరణ్ కు గ్రాఫిక్స్ లో హెల్మెట్లు తగిలించారు. ఇప్పుడు పర్‌ఫెక్ట్‌గా ఉంది అంటూ ట్వీట్ చేశారు. హెల్మెట్ లేని ప్రయాణం నేరమని చెబుతూ ప్రజలకు హితవు పలికారు. హెల్మెట్‌లతో ఉన్న పోస్టర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సైబరాబాద్ పోలీసులు చేసిన ఈ వినూత్న ప్రయత్నానికి ప్రజల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ పోస్టర్‌పై ఆర్ఆర్ఆర్ టీం కూడా స్పందించింది. ఇంకా పోస్టర్ పర్‌ఫెక్ట్ కాలేదు.. బండికి నంబరు ప్లేట్ మిస్సయిందని కామెంట్ పెట్టింది.