తమిళనాట రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. అధికారం కోసం పోటీ పడుతన్న పళని స్వామి, పన్నీర్ సెల్వంలు విడివిడిగా భేటీ అయ్యారు. సీఎం పదవి చేపట్టేందుకు కావాల్సిన మెజార్టీ తమకు ఉందని ఇద్దరు నేతలు గవర్నర్ కు చెప్పడం విశేషం. తమకు 127 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పళని స్వామి వర్గం నేతలు చెప్తున్నారు. తనను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్న లేఖతో పాటూ, ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందజేశారు పళని స్వామి. అంతేకాదు పన్నీర్ సెల్వంకు కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతిస్తున్నారని ఆయన వర్గం చెప్పింది. పళని స్వామితో పాటూ మరో 10 మంది మంత్రులు, పలువురు ఎంపీలు కూడా గవర్నర్ ను కలిశారు.
మరోవైపు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం కూడా తనకే పూర్తి మద్దతు ఉందని గవర్నర్ విద్యాసాగర్ రావుకు చెప్పారు. అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని కూడా పన్నీర్ సెల్వం కోరారు. రహస్య ఓటింగ్ నిర్వహిస్తే తనదే గెలుపని పన్నీర్ ఈ సందర్భంగా గవర్నర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. పన్నీర్ సెల్వంతో పాటూ ఆయన వర్గం నేతలు మధుసూధన్, పొన్నయ్యన్, పాండ్యన్ కూడా ఉన్నారు
అయితే గవర్నర్ మాత్రం ఇరు వర్గాల వాదనలు విని, ఎలాంటి హామీ ఇవ్వకుండానే వారిని తిప్పి పంపారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, బల ప్రదర్శన నిర్వహించాలని గవర్నర్ విద్యాసాగర్ రావు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే గవర్నర్ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.