కరోనా మహమ్మారి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి వల్ల కోవిడ్ వ్యాప్తి రాష్ట్రంలో రోజువారి పాజిటీవ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు,అధికారులతో బుధవారం నాడు మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు కరోనా వ్యాధి నిర్మూలనకు ఎన్నో పటిష్టమైన చర్యలను చేపట్టి అమలు చేయడమే కాకుండా రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేస్తున్నారని మంత్రి తెలిపారు.
పాలకుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం దాదాపు 4వేల మంది కరోన (యాక్టీవ్) రోగులకు కావల్సిన చికిత్స అందించబడుతున్నదని మంత్రి తెలిపారు. ప్రతివారి యోగ క్షేమాలను నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు తెలుసుకొని అవసరమైన సేవలను అందించాలని మంత్రి కోరారు. పాలకుర్తినియోజకవర్గంలోని ప్రజలందరికీ మాస్కులను అందించడానికి 3 లక్షల మాస్కులను పంపించడం జరిగిందని తెలిపారు. మాస్కులు అందరికీ సక్రమంగా పంపిణీ అయ్యే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మంత్రి కోరారు.
జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గులాంటి కోవిడ్ లక్షణాలు ఉన్న వారు ఆలస్యం చేయకుండా కరోనా కిట్‌లు (మందులు) వాడాలని ఆయన కోరారు.నియోజకవర్గంలో కావాల్సిన కరోన కిట్స్ ఆశావర్కర్లు, ఏయన్‌యంలు, డాక్టర్ల వద్ద అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. కరోనా కిట్లలో ఉన్న మందులను వాడినప్పటికీ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే కరోనా టెస్టింగ్ చేయించుకోవాలని ఆయన కోరారు. పాజిటివ్ వచ్చినట్లయితే డాక్టర్లు సూచించిన మందులను వాడాలని, హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు. సీరియస్‌గా ఉన్న కరోన బాధితులను చికిత్స కోసం జనగామ ఏరియా ఆసుపత్రిలోకాని, యంజియం ఆసుపత్రికి పంపించాలని ఆయన కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు తీసుకుంటున్న చర్యలవల్ల ఆక్సిజన్,రెమిడిసివర్ ఇంజక్షన్లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరత లేదని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని తొర్రూర్, పాలకుర్తి మంతడల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా రోగుల చికిత్సకు ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. త్వరలోనే మిగతా మండల కేంద్రాలలో ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకుంటూ కరోన రోగులకు సేవ చేయాలని మంత్రి కోరారు. ప్రస్తుత కాలంలో కరోనా వల్ల కొందరు కార్యకర్తలను పోగొట్టుకున్నామని, చాలా మంది కార్యకర్తలు కరోన భారినపడి ఇబ్బందులు పడుతున్నారని మంత్రి ఆవేధన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితిని అధిగమించడానికి ప్రతి ఒక్కరు ధైరంగా ఉండాలని మంత్రి కోరారు. కోవిడ్ వల్ల ఏమైన ఇబ్బందులు ఉన్నట్లయితే తన దృష్టికి గాని, తన వ్యక్తిగతసిబ్బంది దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు.