బెంగాల్ బెబ్బులి మమతాబెనర్జీ గర్జించింది. పశ్చమబెంగాల్ ఎన్నికల్లో కాలి గాయంతో వీల్‌ఛైర్‌లో కూర్చుని ప్రచారంలో దూసుకుపోతున్న టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ తనను పదే పదే ఓడిస్తానంటున్న ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి తీరుతాను…మళ్లీ సీఎం అవుతానంటూ దీదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం సాధిస్తోందని, అందులో ఎటువంటి అనుమానం లేదని అన్నారు. ఒంటికాలుతో బెంగాల్లో విజయం సాధిస్తానని, భవిష్యత్తుల్లో రెండు కాళ్లతో ఢిల్లీలో గెలుస్తానని ఆమె అన్నారు. హుగ్లీలోని దేబనందపూర్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మమత.. బెంగాల్ ఎన్నికలను 8విడతల్లో నిర్వహించవలసిన అవసరం ఏముందని ఈసీని ప్రశ్నంచారు. కరోనా విపరీతంగా విస్తరిస్తోన్న సమయంలో ఎన్నికలు తక్కువ వ్యవధిలో ముగించలేరా? అని ఆమె ప్రశ్నించారు. ఇది బీజేపీ ఈసీతో కుమ్మక్కై చేసిన పనే అని విమర్శించారు.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేక భారతీయ జనతా పార్టీ.. సీపీఎం, టీఎంసీ నేతలను తెచ్చుకుందని, మంచినీళ్లలా డబ్బులు ఖర్చుపెట్టి వాళ్లను గెలిపించే ప్రయత్నాలు చేస్తుందని దీదీ ఆరోపించారు. బంగారు బంగ్లా అంటూ మాటలు చెబుతున్న గుజరాతీవాళ్లకు ఈ బెంగాల్‌ను పాలించే సత్తానే లేదని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్ మూడో విడత ఎన్నికలు ఏప్రిల్ 6 న జరుగనున్నాయి. ఇటు టీఎంసీకి, అటు బీజేపీకి చాలా కీలకమైన 24 పరగణాల జిల్లాల్లోని 31 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. ఈ జిల్లాలోని డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గత ఎన్నికల్లో 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. బెంగాల్ గడ్డపై తనను చిరాకు పెడుతున్న మోదీ, అమిత్‌షాలపై మమతా దీదీ తీవ్ర ఆగ్రహంతో ఉంది.
ఈ ఎన్నికలు ముగియగానే ఢిల్లీ కోటపై కన్నేసిన మమత ఈ మేరకు నిరంకుశ బీజేపీని ఓడించేందుకు కలిసి రావాల్సిందిగా దేశంలోని బీజేపీయేతర పార్టీల నేతలకు లేఖలు రాయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఢిల్లీ సింహాసనంపై కన్నేసిన దీదీ ముందు ఇంట ముచ్చటగా మూడోసారి గెలిచి…ఆ తర్వాత రచ్చ గెలవాలని భావిస్తున్నారు. అందుకే బీజేపీ నేతలు వ్యక్తిగతంగా దూషించినా లెక్క చేయకుండా బెంగాల్ ఎన్నికలలో గెలిచి ఆ తర్వాత ఢిల్లీ కోటపై దండయాత్రకు బయలుదేరాలని దీదీ డిసైడ్ అయింది. అందు కోసం సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, డీఎంకే అధినేత స్టాలిన్ తదితర నేతలకు ఢిల్లీపై యుద్ధానికి కల్సిరావాల్సిందిగా లేఖలు రాశారు. మొత్తంగా బెంగాల్‌ను ఒంటి కాలితో గెలిచి..ఢిల్లీలో రెండు కాళ్లతో గెలుస్తా అంటూ మమతాదీదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.