చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

254
winter vegitables

చలి మెల్లగా పుంజుకుంటున్నది. వెచ్చదనం కోసం టీ.. కాఫీ తాగుతున్నారా? వెచ్చదనం కోసం స్పైసీనిచ్చే మసాలా.. కారపు పదార్థాలు తింటున్నారా? అసలు ఏవి తినాలి? ఏవి తినొద్దు? తెలుసుకోండి.

* వేరు శనగలో విటమిన్ బీ3, ఇ వంటి కీలక పోషకాలు ఉంటాయి. మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. చర్మంలో తేమశాతాన్ని పెంచే గుణం ఉంటుంది.

* పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. చలికాలపు వ్యాధులను నివారించడంలో ఇది చక్కగా పనిచేస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండి.. రక్తం పెరగడానికి దోహద పడుతుంది. కాల్షియం కూడా పాలకూరలో ఎక్కువే. కండరాల బలోపేతానికి తోడ్పడుతుంది. కాబట్టి చలికాలంలో పాలకూర తినండి.

* ఈ సీజన్‌లో పగటిపూట కూడా వాతావరణం చల్లగానే ఉంటుంది. వెచ్చదనం కోసం నువ్వులు తినండి. నువ్వుల్లో ఉష్ణోగ్రతను పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. ఐరన్.. కాల్షియం.. మాంగనీస్.. మెగ్నీషియం.. కాపర్ వంటి పోషకాలు నువ్వుల్లో పుష్కలంగా ఉంటాయి.

* దానిమ్మ పండు చలికాలంలో తింటే బాగుంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా దానిమ్మ రక్షణనిస్తుంది. చలికాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ వ్యాధుల నివారణలో కూడా దానిమ్మ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి రోజుకో దానిమ్మ పండు తినండి.

* జొన్నల ద్వారా శరీరానికి పుష్కలమైన కాల్షియం అందుతుంది. దీనివల్ల కండరాలు బిగుసుపోకుండా ఉంటాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా మాయమవుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ చలికాలంలో జొన్నతో చేసిన రొట్టె.. గటక.. అన్నం తింటే మంచిది.

* కందగడ్డల్లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని పోగొడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మధుమేహం ఉన్నవారు వీటిని తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబట్టి రెగ్యులర్‌గా కందగడ్డలు తినండి.