ప్రతిపక్షాలు కల్లబొల్లి మాటలకు మోసపోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజలకు ఏమీ చేయని వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళతో ఒరిగేదేమీ లేదు. ఏదైనా చేయ గలిగింది ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమే. కాబట్టి టీఆరెఎస్ కే ఓటు వేయాలని, విద్యాధికుడు, విద్యాసంస్థల అధినేత, మన ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తి, మన సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న, ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద చెప్పే చనువు ఉన్న నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ గా భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు పిలుపునిచ్చారు. నల్గొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా గురువారం మరిపెడలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, పట్టభద్రులతో నిర్వహించిన సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎంపి మాలోత్ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, ఎమ్మెల్యే రెడ్యా నాయక్, అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.
ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… టీఆర్‌ఎస్ రాక ముందు, వచ్చాక పరిస్థితులు బేరీజు వేసుకుని చూడండి. మీ కళ్ళ ముందే అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తున్నాయి. ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల్లో ఏదో ఒకటి మీకు అంది ఉంటాయి. మీ అనుభవం లోకి వచ్చి ఉంటాయి. ఇంత కంటే ఎవరైనా ఎక్కువ చేశారా? చేయగలరా? ఆలోచించండి అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థికి మీ ఓటు వేసి గెలిపించండి… అంటూ పట్టభద్రుల ఓటర్లకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఓట్లు రాగానే కొందరు వస్తుంటారు. పోతూ ఉంటారు. ఇక్కడే ఉండి, మన కోసం ఆలోచించే వాళ్లకు మాత్రమే మన పట్ల, మన ప్రాంతం పట్ల, ఆర్తి ఉంటుంది. అన్నారు.
ఓట్ల కోసమే వచ్చే వాళ్లకు ఈ ప్రాంత సమస్యలు తెలువదని, ఇక్కడి వారే కాదని, అలాంటి వారిని ఎన్నుకుంటే మనకు జరిగే ఉపయోగం ఏమీ ఉండదు అన్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలను మంత్రులు ఏకరువు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాకే అన్ని వర్గాల ప్రజలకు గౌరవం పెరిగిందని, ఉద్యోగుల వేతనాలు పెరిగాయని, భద్రత వచ్చిందన్నారు. అర్థం పర్థం లేకుండా విమర్శించే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని మంత్రి కోరారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడి సమస్యల గురించి తెలిసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ నేతలు నూకల రంగారెడ్డి, కొంపల్లి శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.