ఐపీఎల్ తాజా సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ వేలంలో సంచలనం సృష్టించాడు. అతడు ఏకంగా రూ.16.25కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ అతన్ని ఇంత భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అతని కోసం ముంబై, బెంగళూరు, పంజాబ్, రాజస్థాన్ ఫ్రాంచైజీలు పోటీ పడి బిడ్లు దాఖలు చేశాయి. కేవలం రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో ఎంట్రీ ఇచ్చిన మోరిస్.. చివరికి రికార్డు ధర పలకడం విశేషం.
ఐపీఎల్ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఏ ప్లేయర్ ఈ ధర పలకలేదు. ఇప్పటి వరకూ యువరాజ్ రూ.16 కోట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఇప్పుడా రికార్డు కూడా మరుగున పడిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ఓ విదేశీ ప్లేయర్‌కు గతంలో రూ.15.5 కోట్లు మాత్రమే దక్కాయి. ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్‌ను ఈ భారీ మొత్తానికి కోల్‌కతా కొనుగోలు చేసింది. మోరిస్ ఆ రికార్డును కూడా తిరగరాశాడు.