తాను టీఆర్‌ఎస్‌లో చేరడానికి మిషన్ భగీరథ పథకమే ప్రధాన కారణం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సిద్దిపేట జిల్లాలో కోమటిబండలో మిషన్ భగీరథ రాష్ట్రస్థాయి సమావేశం జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…మిషన్ భగీరథ పథకం విజయవంతానికి కృషిచేసిన ప్రతి ఇంజినీర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
నా రాజకీయ జీవితంలో ప్రజలు నీళ్ల కోసం పడ్డ ఎన్నో బాధలను చూశానని తెలిపిన ఎర్రబెల్లి…. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటికి చాలా నిధులు భారీగా ఖర్చు చేసే వారని, డబ్బులున్నా నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. కానీ, భగీరథ పథకంతో ఆ కష్టం తీరిందన్నారు. సిద్దిపేటలో కేసీఆర్ సాధించిన విజయాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం అమలు చేసినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ పనులు ప్రారంభమైనప్పుడు తాను టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. పనులు చేసిన తీరు, పథకం డిజైన్ చూశాకనే సీఎం కేసీఆర్‌ను విమర్శించొద్దని తన మనసు మార్చుకున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్నో అవార్డులు ఇచ్చిందని, తెలంగాణకు వచ్చినన్ని మరే రాష్ట్రానికి రాలేదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు శుద్ధి నీటిని ఇస్తున్నామని, ప్రజల దాహర్తిని తీర్చిన అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్మితా సబర్వాల్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం ద్వారా 56లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా శుద్ధి చేసిన నీరు సరఫరా అవుతుందని చెప్పారు.