సిద్ధిపేట జిల్లాలోని కేసిఆర్ నగర్‌లో ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 8వ విడత డబుల్ బెడ్ రూం ఇండ్లలను లబ్దిదారులకు అందించారు. అనంతరం వారితో గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ హరీశ్ రావు మాట్లాడుతూ : సిద్దిపేట కేసిఆర్ నగర్‌లో పండుగ వాతావరణంలో 8వ విడత డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల గృహ ప్రవేశాలు జరిగాయి. నిరుపేద ప్రజలు తమ ఆత్మ గౌరవ ప్రతీకల్లోకి సగర్వంగా ప్రవేశం చేశారు. మీ కోసం డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించే అవకాశం.. రావడం భగవంతుడు నాకిచ్చిన అదృష్టంగా భావించా అని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.
హైటెక్ సిటీ కాలనీలోని సంపన్నుల గేటెడ్ కమ్యూనిటీ మాదిరి ఇండ్ల నిర్మాణం చేపట్టాం. సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జరిగాయి. స్వంత ఇల్లు మాదిరే.. పేదల ఆత్మ గౌరవ ప్రతీకల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేశాము. ఇండ్ల నిర్మాణ సమయంలో తాను రెండున్నర ఎండ్లలో.. 400 సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించా అని మంత్రి తెలిపారు. దేశంలోని 718 జిల్లాలో ఎక్కడా లేని విధంగా అన్నీ హంగులు, వసతులతో నిర్మించిన తొలి కాలనీ సిద్ధిపేట కేసిఆర్ నగరే అని మంత్రి హరీష్ పేర్కొన్నారు.
రూపాయి ఖర్చు లేకుండా గూడు లేని గరీబోల్లకే…డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాం. 5 సార్లు వడపోత తర్వాతే నిజమైన లబ్దిదారుల ఎంపికను చేపట్టాం. పార్టీల కతీతంగా నిష్పక్షపాతంగా ఇండ్ల కేటాయింపు జరిపాం. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి.. కొత్త బట్టలతో గృహ ప్రవేశాలు చేయిస్తున్నామన్నారు. పక్కా ఇండ్లను పది కాలాల పాటు కాపాడు కోవాల్సిన బాధ్యతల లబ్ధిదారులదే. అంతేకాదు డబుల్ బెడ్ రూం ఇండ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కమిటీ లుగా ఏర్పడి.. కామన్ ఏరియా పరిశుభ్రంతో పాటు, వసతుల నిర్వహణ చూసుకోవాలని మంత్రి సూచించారు.
ఇవాళ 8వ విడతలో 272 మంది నిజమైన లబ్ధిదారులకు ఇప్పటివరకు మొత్తం 1567 మంది లబ్ధిదారులకు పట్టాలతో పాటు పట్టువస్త్రాలు బహుకరించారు మంత్రి హరీష్ రావు. ఇండ్లను కిరాయికి ఇచ్చినా, అమ్ముకున్నా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. పరిశుభ్ర కేసిఆర్ నగర్ కు ప్రజలు కంకణ బద్దులు కావాలని మంత్రి హరీష్ కోరారు.