తెలంగాణ సోన- మార్కెటింగ్ వ్యూహంపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రూపొందించిన నివేదికను మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం మంత్రుల నివాస సముదాయంలో మంత్రి తెలంగాణ పంట ఉత్పత్తులను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, సహకార కమీషనర్ వీరబ్రహ్మయ్య, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్ రావు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధులు ప్రొఫెసర్ శేషాద్రి, ప్రొఫెసర్ మధు విశ్వనాధన్ మరియు శ్రీధర్ భాగవతుల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైతు ఉత్పత్తులకు విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆరునెలలుగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అడుగులు చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తెలంగాణ రైతు ఉత్పత్తులు చేరాయి. రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు మంత్రి. తెలంగాణ పంట ఉత్పత్తుల గొప్పతనం వినియోగదారులు, ప్రజలకు తెలియాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, సూచనల మేరకు ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వ పరంగా రైతుల ఉత్పత్తులను బ్రాండింగ్ చేయాలన్న ఆలోచన ఇంత వరకు ఎవరూ చేయలేదు. ఇది తెలంగాణ ప్రభుత్వ గొప్ప నిర్ణయం అన్నారు.
25 ఏళ్ల క్రితం అప్పటి పంజాబ్ ప్రభుత్వం బాసుమతి బియ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేయడానికి ముందుకు రావడం మినహా మరే దాఖలాలు లేవు. వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్ ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ అనేక వ్యవసాయ అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ సోన ఖ్యాతి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ సోన ఆరోగ్యకరమైనది. రుచికరమైనది. అధిక ప్రొటీన్లు (8 శాతం), అధికశాతం పీచు (3 శాతం), తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ (51.5 శాతం) కలిగి ఉన్నది. తక్కువ నీటి వినియోగం. ఇతర సన్నరకాలకన్నా 30 రోజులు ముందుగా కోతకు వస్తుంది. యాసంగి, వానాకాలంలో సాగుకు అనుకూలం, తెగుళ్లను తట్టుకునే వంగడమని మంత్రి వివరించారు.
తెలంగాణ సోన గతంలో 4 లక్షల ఎకరాలలో సాగుచేయగా, రాష్ట్రంలో ఈ ఏడాది 10 లక్షల ఎకరాలకు పెరిగింది. దీనికి లభిస్తున్న ఆదరణకు ఇది నిదర్శనం. ఏడు రాష్ట్రాలలో మరో 5 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. కేవలం 50 శాతం మంది వినియోగదారులకు మాత్రమే దీనిపై అవగాహన ఉంది. దీనిని మరింత మందికి తెలియజేస్తే మరింత ఆదరణ లభిస్తుంది. బియ్యం వ్యాపారులు, కిరాణా వర్తకులు దీని గొప్పతనం వినియోగదారులకు తెలియజెప్పేలా వారి పాత్రను నిర్వర్తించాలి. రైతులు తమ ఉత్పత్తులకు మద్దతుధరనే కాదు.. దానికి మించి అదనపు ఆదాయం పొందాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నారాయణపేట, తాండూరు, మక్తల్, పశ్చిమ మహబూబ్ నగర్, పశ్చిమ రంగారెడ్డి ప్రాంతాలలో పండే కంది ప్రత్యేకమయినది. కంది అధిక దిగుబడి రావడంతో పాటు అక్కడి నేలలు, వాతావరణ స్వభావం మూలంగా ఎంతో రుచిగా ఉంటుందని మంత్రి తెలిపారు.
పూర్వపు పాలమూరు (వనపర్తి, నాగర్ కర్నూలు, జోగుళాంబ గద్వాల జిల్లాలు)జిల్లాలో యాసంగిలో పండే వేరుశనగ (పల్లీ) అఫ్లటాక్సిన్ అనే శిలీంధ్రం (ఫంగస్) లేని పంట. దీనికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. తెలంగాణ పత్తి దేశంలోనే ఎంతో నాణ్యమైనది. సీసీఐ సీఎండీ మన పత్తిపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ పంటలకు ఉన్న గొప్పదనాన్ని ప్రజలకు, వినియోగదారులకు వివరించి విస్తరించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యాపారకోణంలో ఆలోచించి తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారుల వద్దకు తీసుకెళ్లాలి.. వారికి అవగాహన కల్పించాలి. విదేశాలలో ఉన్న భారతీయ ఎన్నారైలకు మన ఉత్పత్తుల నాణ్యత తెలిసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.