ఎన్నికల పరిశీలకుల పాత్రకీలకం:పార్థసారధి

120
C Parthasarathi IAS
- Advertisement -

ఎన్నికలలో సాధారణ ఎన్నికల పరిశీలకుల పాత్ర అత్యంత విలువైనదని, వారికి చట్ట ప్రకారం అన్ని రకాల అధికారాలు కల్పించబడినాయని, వారి పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించబడతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి అన్నారు. బుధవారం (18-11-2020) రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశ మందిరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా నియమితులైన అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికలు 6 జోన్స్, 30 సర్కిల్స్ లోని 150 వార్డులకు నిర్వహించడం జరుగుతుందని, ఒక్కో జోన్ పరిధిలోని వార్డులకు ఒక సాధారణ ఎన్నికల పరిశీలకులను నియమించడం జరిగిందన్నారు. పరిశీలకులు స్వతంత్రంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి విశ్వసనీయంగా కళ్ళు, చెవులవలె పనిచేయాలని, వారు సమర్పించిన నివేదికల ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతినిధులుగా నామినేషన్ నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తారని అన్నారు.ఎన్నికల ప్రక్రియలోని ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలించాలని, తుది ఓటరు జాబితా తయారు అయ్యిందని, వార్డుల వారీ తుది జాబితా పోలింగ్ కేంద్రాల తుది జాబితా తయారు అయిన వెంటనే అవుతుందన్నారు.

ఓటరు స్లిప్పులు ప్రతి ఓటరుకూ అందేలా చూడాలని, రాజకీయ పార్టీలు పార్టీ గుర్తు లేకుండా ఓటరు స్లిప్పుల పంచవచ్చని సూచనలు ఇవ్వడం జరిగిందని అన్నారు.పోలీసు శాఖ అధికారులు సమస్యాత్మక, అతి సమస్యాత్మక మరియు క్లిష్టమయిన పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు.ముసాయిదా జాబితా ప్రకారం 9238 పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, తుది జాబితా ఈ నెల 21న ప్రకటిస్తారన్నారు.

పరిశీలకులు తమ విశ్వసనీయమైన నివేదికలను నేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని, పోలింగ్ మరియు కౌంటింగ్ రోజు వారు సమర్పించే నివేదికలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని, ఆ నివేదికల ఆధారంగా రీకౌంటింగ్, ఫలితాల ప్రకటనపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు నామినేషన్ల scrutinee, ఉపసంహరణ, మోడల్ కోడ్ ఉల్లంఘన, పోస్టల్ బాలట్, ఓటర్ల జాబితా, పొలిటికల్ పార్టీల సమావేశాలు, బాలట్ బాక్సులు తదితర విషయాలపై దృష్టి పెట్టాలన్నారు.

పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, అభ్యర్థుల ఎన్నికల వ్యయం వంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించాలన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల పరిశీలకులకు సహకరించేందుకు సిబ్బందిని నియమించామని, వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.

ఈ సమావేశానికి ఎల్బీనగర్ జోన్ సాధారణ పరిశీలకులు ఏ.శ్రీదేవసేన, ఐఏఎస్, చార్మినార్ జోన్ సాధారణ పరిశీలకులు ఈ. శ్రీధర్, ఐఏఎస్ ఖైరతాబాద్ జోన్ సాధారణ పరిశీలకులు కె. మానిక్ రాజ్, ఐఏఎస్ శేరిలింగంపల్లి జోన్ సాధారణ పరిశీలకులు ప్రీతి మీనా, ఐఏఎస్ కూకట్ పల్లి జోన్ సాధారణ పరిశీలకులు ఎం. ప్రశాంతి, ఐఏఎస్ సికింద్రాబాద్ జోన్ సాధారణ పరిశీలకులు ఐషా మస్రత్ ఖానం, ఐఏఎస్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీ జయసింహా రెడ్డి, జోనల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -