రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో 2020-21 సంవత్సరానికి గాను ఆస్తి పన్నులో రాయితీ కల్పిస్తూ తీపి కబురు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 15 వేల వరకు ఆస్తి పన్ను ఉన్న వారికి 50 శాతం రాయితీ అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో రూ.10 వేల పన్ను ఉన్న వారికి 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే ఆస్తిపన్ను చెలించిన వారికి వచ్చే ఏడాది సర్దుబాటు అవుతుందని తెలిపారు.ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల 40 వేల కుటుంబాలకు రూ.326.48 కోట్ల లబ్ది చేకూరనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 13 లక్షల 72 వేల కుటుంబాలకు లాభం చేకూరుతుందన్నారు.
గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ దాని చుట్టు ప్రక్కల ఉన్న 15 పట్టణాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురిశాయని….వర్షాల వల్ల లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వరద సాయం అందని వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటివరకు వరకు 4 లక్షల 75 వేల 871 కుటుంబాలకు గాను ఇప్పటికే 470 కోట్ల పైచిలుకు రూపాయలను సాయంగా అందజేశామని తెలిపారు.