జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన రాడ్యా మహేశ్‌కు ఐటీ మంత్రి కేటీఆర్ ఘన నివాళులర్పించారు. మహేశ్ త్యాగం మరువలేనిదని… మహేశ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు. మీ వీరత్వం ఎప్పటికీ మరచిపోలేమని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి.
రాడ్యా మహేష్ మృతి పట్ల రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి భారతావని కోసం మహేష్ చేసిన త్యాగం మరువలేనిదన్నారు. మహేష్‌తో పాటు వీరమరణం పొందిన తోటి సైనికులకు జోహార్లు తెలిపారు.
మహేశ్ 2015లో ఆర్మీ జవాన్‌గా విధుల్లో చేరాడు. మహేశ్ 6వ తరగతి వరకు వేల్పూర్ మండలం కుకునూర్ ప్రభుత్వ పాఠశాలలో,7-10వ తరగతి వరకు వేల్పూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. బాల్యం నుంచి దేశభక్తి భావాలు ఉన్న మహేశ్ ప్రత్యేక ఆసక్తితో ఆర్మీలో చేరారు. మహేశ్ ఏడాది క్రితం సుహాసినిని ప్రేమవివాహం చేసుకున్నాడు.