చైనాకు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల తయారీదారు వన్‌ప్లస్ బుధవారం హైదరాబాద్‌లో తన అతిపెద్ద ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నగరం కొత్త మైలురాయిని పొందింది అని తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన వన్‌ప్లస్ స్టోర్ హైదరాబాద్‌లో ప్రారంభమైందని చెప్పడానికి సంతోషిస్తున్నానని కేటీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా వన్‌ప్లస్ ఇండియా టీమ్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే వన్‌ప్లస్ స్టోర్‌ను విజిట్ చేస్తానని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. గత ఆరేండ్లలో హైదరాబాద్ నగరాన్ని న్యూ టెక్‌హబ్‌గా తీర్చిదిద్దగలిగామని మంత్రి చెప్పారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. ఆరోగ్యం, విద్యారంగాల్లో ప్రమాణాలు పాటిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక హిమాయత్‌నగర్‌లో బుధవారం ప్రారంభించిన ఈ స్టోర్.. అంతర్జాతీయంగా సంస్థకు భారీది కావడం విశేషం. ‘వన్‌ప్లస్ నిజాం ప్యాలెస్’ పేరుతో 16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో ఓ అతిపెద్ద కస్టమర్ సర్వీస్ సెంటర్ కూడా ఉన్నది. దేశవ్యాప్తంగా సంస్థకు 5వేలకుపైగా ఆఫ్‌లైన్ స్టోర్లున్నాయి.