చెరకు రైతుల బకాయిలు 18లోగా చెల్లించాలి- మంత్రి హరీశ్

188
harish
- Advertisement -

ట్రైడెంట్ సుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం జహీరాబాద్ చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఈ నెల 18 వ‌తేదీలోగా చెల్లించాలని ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఈ లోగా చెల్లించే పోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కంపెనీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశ్రామిక వేత్తలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అవసరమైన వాతావరణం కల్పించిదన్నారు. ఇలాంటి తరుణంలో రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు గురి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఉర్కోదన్నారు. జహీరాబాద్ పరిధిలో 9 వేల మంది చెరకు రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీ పడదన్నారు.

ఇప్పటికే చెరకు రైతులు‌ ట్రైడెంట్ యాజమాన్యంపై విశ్వాసం కోల్పోయారని దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదేనని యాజమాన్య ప్రతినిధులకు చెప్పారు. ప్రతీ ఎడాది చెరకు కొనుగోలు ఒప్పందాలు రైతులతో పారదర్శకంగా చెసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఇతర సుగర్స్ ఫ్యాక్టరీలు చెల్లిస్తున్న రీతిలో రైతులకు అదే ధర చెల్లించాలన్నారు. రైతుల సమక్షంలో నే సుగర్స్ ఫ్యాక్టరీ నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. తక్షణ, దీర్ఘ కాలిక ప్రణాళికలు‌ తయారు చేసి సుగర్స్ ఫ్యాక్టరీ ని సమర్థవంతంగా నడపాలన్నారు.

చెరకు రైతుల బకాయిల చెల్లింపుల విషయంలో కంపెని ఇచ్చిన మాట తప్పితె‌ రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు‌ తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో పాటు రైతులకు చెరకు అమ్మకాలకు ఇబ్బంది‌లేకుండా అన్ని రకాల‌ చర్యలు తీసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతులకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం సహించేది లేదన్నారు. సుగర్ ఫ్యాక్టరీ నిర్వహణ విషయంలో ఎదైనా సహకారం కావాల్సి వస్తే నిబంధనలకు అనుగుణంగా పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

రైతులకు చెల్లించాల్సిన బకాయిలు ఈ నెల‌ 11 వ తేదీన ఐదు కోట్లు, 18వ తేదీన 8 కోట్లు చెల్లించాలని మంత్రి హరీశ్ రావు సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్య ప్రతినిధులను ఆదేశించారు. చెప్పిన సమయంలోగా రైతులకు చెల్లింపులు చేయకపోతే రెవెన్యూ రికవరీ చట్టంకు అనుగుణంగా చర్యలుంటాయన్నారు. అందుకు సుగర్ ఫ్యాక్టరీ ప్రతినిధులు మంత్రి ఆదేశాల మేరకు 11న ఐదు‌కోట్లు, 18వ తేదీన మిగతా 8 కోట్లు చెల్లిస్తామని హమీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఎంపీలు బీబీ పాఠిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు‌ జి.ఆర్. రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీడీసీ ఛైర్మన్ ఉమాకాంత్, డీసీఎంఎస్‌ ఛైర్మన్ శివ కుమార్, సుగర్ కేన్ డైరెక్టర్ రవీందర్ రావు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -