శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పర్యటించారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో, ఐకెపి, గూడూరు గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పట్ల రైతులకు విశ్వాసం ఉంది అందుకే సీఎం కెసిఆర్ చెప్పిన పంట వేశారని తెలిపారు. రైతుకు ఇట్లా సాయం చేసే ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు. పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నాం అందుకే దేశ ఆర్థిక వ్యవస్థ తలకిందులు అయినా మన రాష్ట్రంలో చెక్కు చెదరకుండా ఉందన్నారు.
వేప చెట్టుకింద కూర్చుని ఆందోళన చెందవద్దు. అన్ని విధాలుగా ఆదుకుంటాం. మేము ఆకాశం నుండి ఊడిపడలేదు. మీ మధ్యనుండి వచ్చాం సమస్యలు అన్నీ తెలుసు. ప్రజల సమస్యలు పరిష్కరించిన వాడే నిజమైన రాజకీయ నాయకుడు అన్నారు మంత్రి. ప్రజల కన్నీరుకు, బాధలకు పరిష్కారం చూపుతం. వర్షాల వల్ల కొన్ని చోట్ల ధాన్యం రంగు మారినాయి, మొలకలు వచ్చినాయి అయినా వాటిని రిజెక్ట్ చేయకుండా కొనుగోలు చేయాలి. రైతు మీద బతికేవాడే రైస్ మిల్లర్ అనే విషయం మర్చిపోవద్దు. రైతు చల్లగా ఉంటేనే మనమంతా చల్లగా ఉంటామన్నారు మంత్రి ఈటెల.