బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కు మరోసారి సవాల్ విసిరారు మంత్రి హరీశ్ రావు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు…బండి సంజయ్కు మరోసారి సవాల్ విసిరారు. బీడీ కార్మికులకు కేంద్రం రూ. 1600 ఇస్తున్న మాట నిజమైతే.. దుబ్బాక పాత బస్టాండ్ వద్దకు చర్చకు రావాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దుబ్బాకకు బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు.
భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా పుకార్ల పుట్ట.. అబద్దాల గుట్ట అని ఆర్థిక మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాయలో పడొద్దని దుబ్బాక ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఒక్కరి మద్దతు ఉందన్నారు. దుబ్బాకపై సీఎం కేసీఆర్కు ఎనలేని ప్రేమ ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్కు బీడీ కార్మికుల కష్టాలు తెలుసుకాబట్టే వారికి రూ. 2 వేల పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు. బీడీ కార్మికుల పెన్షన్ల విషయంలో బీజేపీ నాయకులు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.
దుబ్బాకలో ప్రభుత్వ ఆస్పత్రిని టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని తెలిపారు. రూ. 18 కోట్లతో 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేశామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు తీరాయన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మళ్లీ కరెంట్, మంచినీటి కష్టాలు వస్తాయన్నారు. మహిళలందరూ కారు గుర్తుకు ఓటేసి.. మీ శక్తిని చూపించాలి అని పిలుపునిచ్చారు.