అబుదాబి వేదికగా ఐపీఎల్-13వ సీజలో ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లలోనూ హిట్టర్లు ఉండటంతో ఈ పోరులో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సీనియర్, యువ ఆటగాళ్ల కలయికతో ఢిల్లీ జట్టు సమతూకంతో ఉంది.
రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ కీలక సమయంలో బ్యాట్ ఝుళిపిస్తే ఢిల్లీకి కష్టాలు తప్పవు. అలాగే, ఢిల్లీ జట్టులోనూ లోయర్ ఆర్డర్లో హెట్‌మైర్, స్టోయినీస్ మెరుపు బ్యాటింగ్‌తో అదరగొడుతున్నారు. రెండు జట్లలోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పే బౌలర్లు, బ్యాట్స్‌మెన్ ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
గతంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 24 సార్లు తలపడ్డాయి. రెండు టీమ్‌లు చెరో 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అంటే రెండూ సమవుజ్జీలుగా ఉన్నాయన్న మాట..! ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టిలో రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడి నాలుగింట విజయం సాధించారు. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. చెన్నై, బెంగూళరు చేతిలో మాత్రమే ఓడిపోగా.. కోల్‌కతా, పంజాబ్, హైదరాబాద్, రాజస్థాన్ జట్లపై గెలుపొందారు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. పాయింట్ల పట్టికలో ఈ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. ఏకంగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క హైదరాబాద్ చేతిలో మాత్రమే ఓటమి పాలయింది. పంజాబ్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, రాజస్థాన్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో గెలుపొందింది. గత ఐదు మ్యాచ్‌ల్లో రెండు జట్లు నాలుగు గెలిచాయి. చెరో మ్యాచ్‌లో ఎడిపోయాయి. ఈ సమఉజ్జీల పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.