జిహెచ్ఎంసి హౌసింగ్ కార్యక్రమాలపై కేటీఆర్ సమీక్ష

267
ktr
- Advertisement -

జిహెచ్ఎంసి పరిధిలో కొనసాగుతున్న హౌసింగ్ కార్యక్రమాల పైన హౌసింగ్ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తో కలిసి పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ప్రగతి భవన్లో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ, ఇతర హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో జిహెచ్ఎంసి పరిధిలో కొనసాగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పురోగతిని మంత్రులు ఇరువురు సమీక్షించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇల్ల నిర్మాణం కొనసాగుతుందని త్వరలోనే ఇవన్నీ పూర్తవుతాయన్న సమాచారాన్ని అధికారులు మంత్రులకు అందజేశారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి కావడానికి గడువు సమీపిస్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన ఈ ప్రక్రియ చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి హౌసింగ్ శాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిహెచ్ఎంసి కమిషనర్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఇతర జిల్లాల కలెక్టర్ లతో కలిసి సంయుక్తంగా లబ్ధిదారుల ఎంపిక చేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక పైన ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని సూచించారు.

జిహెచ్ఎంసి కోసం ఇతర జిల్లాల పరిధిలో కడుతున్న ఇళ్లలో పది శాతం లేదా 1000 మించకుండా స్థానికులకు ఇల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పైన కసరత్తు చేయాలని గతంలో ఇల్లు అందిన వారికి మరోసారి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాకుండా చూడాలని ఈ సందర్భంగా మంత్రులు సూచించారు. దీంతో పాటు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలని, ఇందుకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో హౌసింగ్ శాఖ అధికారులతో కలిసి పని చేయాలని ఈ సందర్భంగా హౌసింగ్ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది అని అధికారులు మంత్రులకు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం కొనసాగుతున్న ప్రాంతాల్లో గ్రీనరీ కి ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటి నుంచే అక్కడ మొక్కల పెంపకం చేపట్టాలన్నారు మంత్రులు. త్వరలోనే మరోసారి హౌసింగ్ శాఖ అధికారులతో సమావేశం అవుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

- Advertisement -