పచ్చదనం పెంపుకు ప్రాధాన్యం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

264
minister indrakaran
- Advertisement -

హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా క్షీణించిన అడ‌వుల్లో పెద్ద ఎత్తున్న మొక్క‌లు నాటడ‌మే కాకుండా అట‌వీ సంప‌ద‌ను కాపాడేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌కడ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ఆర‌వ విడ‌త హరిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా బోథ్ నియోజ‌క‌వ‌ర్గంలోని నేర‌డిగొండ మండ‌లం బోరిగాం, బోథ్ మండ‌లం కౌట‌- బి గ్రామాల్లో మంత్రి అల్లోల మొక్క‌లు నాటారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… అడ‌వుల ర‌క్ష‌ణ‌ చ‌ర్య‌ల్లో భాగంగా అడవిలోకి ఇతరులు ప్రవేశించకుండా దారులను మూసేందుకు కంచెలు,కందకాలు ఏర్పాటు చేశామ‌న్నారు. అట‌వీ సంప‌ద‌ను కాపాడేందుకు పోలీసు శాఖ స‌హాకారంతో అట‌వీ అధికారులు ఆహార్నిష‌లు కృషి చేస్తున్నార‌ని పేర్కొన్నారు. అడ‌వుల‌ సంరక్ష‌ణ‌పై ప్ర‌జ‌ల్లో కూడా అవ‌గాహన పెరిగింద‌ని, వారి భాగ‌స్వామ్యం, నిరంత‌ర నిఘా వ‌ల్ల‌ క‌ల‌ప స్మ‌గ్లింగ్ కు అడ్డుక‌ట్ట వేయ‌గ‌లిగామ‌న్నారు.

రాష్ట్రం ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మకమైన పంచాయతీరాజ్, పురపాలక చట్టాలతో పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామ‌ని వివ‌రించారు. నాటిన మొక్కలలో కనీసం 85 శాతం మొక్కలను కాపాడే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంద‌ని పేర్కొన్నారు. గ్రామ పంచాయ‌తీల్లో, పట్టణాల్లో పచ్చదనానికి పది శాతం నిధులు కేటాయించారన్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రతి గ్రామ పంచాయతీలో న‌ర్స‌రీల‌ను ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నార‌ని, ప‌చ్చ‌ద‌నం – ప‌రిశుభ్ర‌త కోసం ప్ర‌తి గ్రామ‌ పంచాయతీకి ట్రాక్టర్లను కూడా సమకూర్చార‌‌ని తెలిపారు.హరిత తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా అందరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టి విరివిగా మొక్కలు నాటి రేపటి తరానికి స్వచ్ఛమైన గాలిని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, క‌లెక్టర్ దేవ‌సేన‌,త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -