మండుటెండలతో అల్లాడుతున్న జనానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. నైఋతి అరేబియా సముద్రం మరియు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు మరియు మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించాయి.
రాగల 48 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన సుమారుగా జూన్ 1న కేరళలోకి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్ మరియు నారాయణపేట జిల్లాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.